జీవిత భాగస్వామి మరణాన్ని మనుషులే కాదు, పశుపక్ష్యాదులు కూడా భరించలేవు. అందుకు ఉదాహరణగా నిలుస్తున్నది ఈ వీడియో. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో ‘టచింగ్ వీడియో’ పేరుతో మంగళవారం ఒక పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. చనిపోయిన ఒక నెమలిని పూడ్చేందుకు ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తుంటారు. అయితే దానిని మరో నెమలి అనుసరిస్తుంది. ‘బంధమా.. నన్ను వీడిపోకుమా’ అన్నట్లుగా విగతజీవిగా మారిని జీవిత భాగస్వామిని అది ఫాలో అవుతుంది. ఈ ఘటన రాజస్థాన్లోని కుచెరా పట్టణంలో జరిగినట్లు ఆయన తెలిపారు. వాట్సాప్ ద్వారా ఈ క్లిప్ తనకు చేరిందన్నారు. ‘మరణించిన దీర్ఘకాల భాగస్వామిని విడిచిపెట్టేందుకు నెమలి ఇష్టపడటం లేదు. మనసుకు హత్తుకునే వీడియో’ అని పేర్కొన్నారు. కాగా, ఆ రెండు నెమళ్లు నాలుగేండ్లు కలిసి జీవించాయని, మరణించిన జీవిత భాగస్వామి అంత్యక్రియల్లో ఆ నెమలి పాల్గొన్నట్లుగా మీడియాలో వచ్చిన కథనాన్ని పర్వీన్ మరో ట్వీట్లో పోస్ట్ చేశారు.
మరోవైపు, 19 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక్క రోజులోనే 1.26 లక్షల మంది దీనిని వీక్షించారు. మనసును ద్రవిస్తున్నదని ఒకరు, మనుషుల కంటే జంతువులే ఎక్కువ ప్రేమ చూపుతాయని మరొకరు పేర్కొన్నారు. పశుపక్ష్యాదులు పడే బాధ వాటిని పెంచే వారికే ఎక్కువగా తెలుస్తుందని ఒకరు వ్యాఖ్యానించారు. మనుషులైనా జంతువులైనా జీవిత భాగస్వామిని కోల్పోతే తమను శూన్యంలోకి పడేసినట్లుగా నిరాశకు లోనవుతారంటూ ఒక నెటిజన్ అభివర్ణించారు.
The peacock doesn’t want to leave the long time partner after his death. Touching video. Via WA. pic.twitter.com/ELnW3mozAb
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 4, 2022