లండన్ : వారాల తరబడి దూర ప్రయాణాలు సాగించడం ఖరీదైన వ్యవహారమే కాకుండా తీవ్ర అలసటకూ గురవుతుంటాం. అయితే బ్రిటన్లో 75 ఏండ్ల బామ్మ ఏకంగా 3500 కిలోమీటర్లు ఉచితంగా ఇంగ్లండ్ నలుమూలలనూ చుట్టేసింది. ఫ్రీ బస్ పాస్తో పెన్నీ ఐబట్ ఆరు వారాల పాటు 120 బస్ల్లో తిరుగుతూ ఇంగ్లండ్ అంతటినీ కవర్ చేసింది. ఒక లొకేషన్ నుంచి మరో చోటికి చేరేందుకు ఆమె పలు బస్లు మారుతూ రోజుకు ఎనిమిది గంటలు ప్రయాణించింది.
చివరి 20 కిలోమీటర్లు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఓపెన్ టాప్ బస్లో ప్రయాణించింది. పెన్నీ తన పెన్షనర్ పాస్తో ఇంగ్లీష్ బస్ల్లో ఉచితంగా ప్రయాణించింది. పాస్ చెల్లుబాటు కాని స్కాట్లాండ్ సరిహద్దులో మాత్రం ఆమె టికెట్లు కొనుగోలు చేయాల్సి వచ్చింది. పెన్నీ యాత్ర సెప్టెంబర్ 6న ప్రారంభమై అక్టోబర్ 16న ముగిసింది. ఈ జర్నీలో ఆమె మొత్తం 120 బస్ల్లో ప్రయాణించింది.
ఐదు వారాల ఐదు రోజుల ప్రయాణంలో తాను ఎంతోమంది ఆసక్తికర, దయాగుణం కలిగిన వారిని కలిశానని ఆమె చెప్పుకొచ్చింది. దెవాన్లోని మైనిహీడ్ నుంచి లిమౌత్ వెళ్లే ప్రయాణం తనకు విశేషంగా ఆకట్టుకుందని, ఈ మార్గంలో అద్భుత వాతావరణం, ఆహ్లాదకర దృశ్యాలు మైమరపించాయని అన్నారు.