లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు సుమారు వివిధ ప్రాంతాలకు చెందిన వంద మందికిపైగా మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి.. మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ మహిళా నాయకత్వానికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి, సంస్థ చేపడుతున్న సాంస్కృతిక సేవా కార్యక్రమాల గురించి సభకు వివరించారు.
మహిళలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందన్నారు. ఆత్మ విశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా ఆడపిల్లలు జీవితంలో ముందుకు సాగాలన్నారు. వచ్చిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకున్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని, ప్రతి అవకాశాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలని, పురుషుల కన్నా మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలని, దేశాభివృద్ధిలో మహిళలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అని అన్నారు.
స్థానికంగా మన స్వదేశం నుండి వచ్చిన మహిళలు, అమ్మాయిలకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వారికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ వేడుకలను విజయవంతం చెయ్యడానికి కొన్ని వారాల నుండి కష్టపడి పని చేసిన టాక్ మహిళా నాయకులు జాహ్నవి దూసరి, విజితా రెడ్డి, శైలజ జెల్లా, స్నేహ నవాపేట్, సృజన, శ్వేతలను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ వేడుకల నిర్వహణలో ఎంతో సహకరించి ప్రోత్సహించిన టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. టాక్ ప్రధాన కార్యదర్శి జాహ్నవి దూసరి మాట్లాడుతూ.. దాదాపు వంద మందికి పైగా మహిళలు ఒకేచోట చేరి మహిళా దినోత్సవం జరుపుకోవడం టాక్ ప్రస్థానంలో ఇదే మొదటి సారని చెప్పారు.
ఈ వేడుకలు ఇంతటి విజయం సాధించడానికి ముఖ్య కారణం ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి కృషి, ఇతర మహిళా సభ్యుల సహాకారం, ముఖ్యంగా టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మరియు అధ్యక్షుడు రత్నాకర్ ప్రోత్సాహమని చెప్పి వారందరినీ ప్రశంసించారు.
అలాగే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి మహిళల సంరక్షణ కొరకు, వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలని చేపడుతున్నారని. స్థానిక సంస్థల్లో మహిళా కోటా తెచ్చి మహిళలను మేయర్లని, మున్సిపల్ ఛైర్పర్సన్లను చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుంతుందని అన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రం, మహిళా సాధికారతలో కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని జాహ్నవి తెలిపారు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, తమ కార్యక్రమానికి హాజరై టాక్ సంస్థను ప్రోత్సహించిన అతిధులకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ మహిళా సెల్ ఇన్ఛార్జ్ విజిత రెడ్డి దుగ్గంపుడి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో పురుషులకు ధీటుగా మహిళలు అద్భుత విజయాలు సాధిస్తున్నారని తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలకు ప్రతీకగా ప్రపంచం అంతా జరుపుకునే వేడుక అని అభివర్ణించారు. టాక్ సంస్థలో ప్రవాస మహిళలంతా భాగస్వాములు అవ్వాలని మనమంతా కలిసి ఎన్నో సాంస్కృతిక సేవా కార్యక్రమాలు చెయ్యొచ్చని విజిత తెలిపారు.
ఎన్నో రకాల ఆటలు, గెలిచిన వారికి బహుమతులు, మహిళలంతా ఇంటి నుండి తీసుకొచ్చిన వివిధ రకాల వంటలను ఒకరికొకరితో పంచుకొని రోజంతా సరదాగా గడిపారు. ఆ తర్వాత టాక్ మహిళా సెల్ కార్యదర్శి క్రాంతి రెటినేని వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జాహ్నవి దూసరి, మహిళా సెల్ ఇన్ఛార్జ్ విజిత రెడ్డి దుగ్గంపూడి, మహిళా సెల్ కార్యదర్శి క్రాంతి రెటినేని, పవిత్ర, స్వాతి, శ్వేత మహేందర్, శైలజ జెల్లా, శ్రావ్య, సృజన, స్నేహ, విద్య తదితరులు పాల్గొన్నారు.