US Visa | నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా క్యాటగిరీలో అమెరికాకు వెళ్లే భారతీయులు సుదీర్ఘ కాలం వేచి ఉండక తప్పదని భారత్‌లోని అమెరికా ఎంబసీ ప్రకటించింది. దీనికి కోవిడ్-19 ఆంక్షలే కారణమని పేర్కొంది. నవంబర్ 8 నుంచి భారత్‌తోపాటు వివిధ దేశాల పౌరుల రాకకు అమెరికా అనుమతించింది. భారత్ నుంచి సుమారు 30 లక్షల మంది వీసాదారులు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే అమెరికాకు వెళ్లే వారు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ చేయించుకున్న సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను ఎంబసీ, కాన్సులేట్స్ పరిశీలించి ఆమోదం తెలిపితేనే సంబంధిత వ్యక్తులకు వీసా జారీ అవుతుంది. సాధారణంగా ముందు పాస్‌పోర్ట్ వచ్చాక వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న 20 రోజుల నుంచి నెల లోపు వీసా వస్తుందని సమాచారం. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన వ్యాక్సిన్, అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఆమోదం పొందిన వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే అమెరికాలో ప్రవేశించడానికి అనుమతినిస్తారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారు తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతినిస్తున్నట్లు అమెరికా ఎంబసీ వివరించింది.