US Sankar Netralaya | పేద రోగులకు దృష్టి పునరుద్ధరణ కోసం యూఎస్ఏ శంకర నేత్రాలయ ఈ నెల 17న అద్భుతమైన శాస్త్రీయ నృత్య కార్యక్రమం నిర్వహించింది. పేదలకు దృష్టి పునరుద్ధరణకు నృత్య కళాకారులు అంకిత భావంతో నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ నృత్య ప్రదర్శనలకు విరాళాలిచ్చిన దాతలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర నేత్రాలయ 13 లక్షల డాలర్ల నిధులు సేకరించింది. వీటితో 20 వేల మందికి కంటి శుక్లం శస్త్రచికిత్సలు చేయొచ్చు.
అట్లాంటాలో నాలుగు ప్రసిద్ధ శాస్త్రీయ నృత్య అకాడమీల ఆధ్వర్యంలో సుమారు 100 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆహుతులను అలరించారు. ప్రతి నృత్య రూపకానికి ప్రేక్షకుల నుంచి చప్పట్లు, హర్షద్వానాలు వ్యక్తం అయ్యాయి. ప్రదర్శనకారులంతా అంకిత భావం, క్రమశిక్షణతో కళాత్మక నైపుణ్యానికి నిజమైన నిదర్శనంగా నిలిచారు.
వాసవీ కన్యకా పరమేశ్వరి అకాడమీ ఆఫ్ కూచిపూడి నృత్య గురువు శశికళ పెనుమర్తి ఆధ్వర్యంలో 17 మంది నృత్యకారులు శరణం అయ్యప్ప కలైవాణి డ్యాన్స్, అకాడమీ గురువు పద్మజ కేలం సారధ్యంలో 13 మంది నృత్యకారులు నాదబ్రహ్మ శంకర, శ్రీవాణి కూచిపూడి అకాడమీ గురువు రేవతి కొమండూరి ఆధ్వర్యంలో 13 మంది నృత్యకారులు పంచభూత ప్రశస్తి , నటరాజ నాట్యాంజలి కూచిపూడి అకాడమీ గురువు నీలిమ గడ్డమణుగు ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని విద్యా సంస్థలు, గురువులు, విద్యార్థులకు యూఎస్ఏ శంకర నేత్రాలయ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపింది. పేద రోగుల దృష్టి పునరుద్ధరణ కోసం అట్లాంటా హిందూ దేవాలయం పూజారి పవన్ కుమార్ క్రిస్టాపతి పవిత్ర మంత్రాలతో సత్కారాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాటంరెడ్డి ప్రసాదరెడ్డి, ఆయన భార్య శోభారెడ్డి ఐదు లక్షల డాలర్ల విరాళం అందజేశారు. ఆయన తల్లి దుర్మరణం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఆయన సహకారంతో 11 కంటి శిబిరాలకు మద్దతు లభించింది. భారతదేశంలోని అత్యవసర ప్రాంతంలో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయబడింది.శంకర నేత్రాలయ యూఎస్ఏ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రసాద రెడ్డి కాటంరెడ్డిని ప్రకటించారు.
శంకర నేత్రాలయ యూఎస్ఏ అడ్వైజర్ల బోర్డు సభ్యుడు డాక్టర్ కిషోర్ చివుకుల లక్ష డాలర్లు విరాళంగా అందించారు. మరో అడ్వైజర్ బోర్డు సభ్యుడు- పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ షేత్ జగదీష్ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఎంఈఎస్‌యూ అడాప్ట్ ఏ విలేజ్ కంటి వైద్య శిబిరం స్పాన్సరింగ్ కోసం 12,500 డాలర్ల విరాళం అందజేశారు. ఆగస్టా-జార్జియా నుండి టి రామచంద్రారెడ్డి ఎనిమిది కంటి శిబిరాలకు 1,00,000 డాలర్ల విరాళం ప్రకటించారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా నంది వడ్డెమాన్ గ్రామంలో ఒక కంటి శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. యూఎస్ఏ శంకర నేత్రాలయ ప్రెసిడెంట్ బాలా రెడ్డి ఇందుర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మూర్తి రేకపల్లి భారతదేశంలో ఎంఈఎస్‌యూ కార్యకలాపాల పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత్ కాన్సులేట్ జనరల్ రమేశ్ బాబు లక్ష్మణన్‌కు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
యూఎస్ఏ శంకర నేత్రాలయ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీని వంగిమల్ల, మెహర్ చంద్ లంక, రాజ్ ఐల, శ్రీధర్ జూలపల్లి, నీలిమ గడ్డమణుగు, డాక్టర్ మాధురి నాముదురి, స్పోర్ట్స్ కమిటీ చైర్ రమేష్ చాపరాల, ఎంఈఎస్‌యూ కమిటీ సభ్యుడు డాక్టర్ కిషోర్ రెడ్డి రసమల్లు తదితర ప్రముఖుల నుంచి నిరంతరం మద్దతు అందింది. అట్లాంటా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తడికమళ్ళతో పాటు చాప్టర్ లీడర్స్ చిన్మయ్ దస్మోహపాత్ర, హేమంత్ వర్మ, పేన్మెట, సుధీర్ పాత్రో, విజయ్ గార్లపాటి ఈ ఈవెంట్ విజయవంతంలో కీలకంగా వ్యవహరించారు.