UK New Visa Rules | బీటెక్ లేదా బీఈ పూర్తి చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థులు.. ఎంఎస్ చేయడానికి అమెరికా లేదా బ్రిటన్ లేదా కెనడా వంటి దేశాలకు వెళుతున్నారు. కానీ, అగ్రరాజ్యాలు వీసా నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ప్రత్యేకించి బ్రిటన్.. తన వీసా విధానంలో సంస్కరణలను తేవాలని ప్రతిపాదించింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు తమ డిపెండెండ్లను బ్రిటన్‌కు తీసుకు రాకుండా.. తమ అకడమిక్ స్టేటస్‌ను దుర్వినియోగ పరిచి ఉద్యోగాలు చేయకుండా.. బ్యాక్ డోర్ వర్క్ చేయకుండా ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో లోపాలను చక్కదిద్ది.. సంస్కరణలు తేవాలని యోచిస్తున్నట్లు బ్రిటన్ హోంమంత్రి సువెల్లా బ్రేవర్మన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
‘విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్‌కు తీసుకు రావడం గణనీయంగా పెరిగింది. ఇది ప్రభుత్వ సర్వీసులపై ఒత్తిడి పెంచుతున్నది’ అని సువెల్లా బ్రేవర్మన్ ట్వీట్ చేశారు. ‘డిపెండెండ్లను తేవడం గానీ, బ్యాక్ డోర్ వర్క్‌కు తమ వీసా నిబంధనలను వాడకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులను నియంత్రించడం ద్వారా వలసలు తగ్గించవచ్చు` అని తెలిపారు. ఇందుకోసం బ్రిటన్ ప్రభుత్వం మంగళవారం కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకటించింది.
కొత్త వీసా రూల్స్ అమల్లోకి తేవడం వల్ల విదేశీ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకు రాకుండా నియంత్రించవచ్చునని బ్రిటన్ సర్కార్ భావిస్తున్నది. విద్యార్థుల డిపెండెంట్లు భారీగా బ్రిటన్ రాకుండా జారీ చేసే వీసాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నది. విద్యార్థులను పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ ప్రోగ్రామ్ లో చేరే విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రమే కొత్త రూల్స్ అనుమతి ఇవ్వనున్నాయి. ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధన ప్రకారం పీజీ విద్యార్థులు తమ జీవిత భాగస్వాములను కూడా తీసుకెళ్లవచ్చు. ఆ నిబంధనకు ఆంక్షలు తీసుకొస్తే ఇప్పుడు 30 వేల మంది విద్యార్థులు ఏటా 10 వేల మంది మాత్రమే తమ జీవిత భాగస్వాములను బ్రిటన్ కు తీసుకువచ్చేందుకు అనుమతి ఇస్తారు.