తెలుగు భాషకు విశిష్ట సేవలందించిన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని సంద్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని (Telugu Language Day) దక్షిణాఫ్రికాలోని జొహెన్స్బర్గ్లో (Johannesburg ) ఘనంగా నిర్వహించారు. స్థానిక డ్రీమ్ హిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో వేడుకలను నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (AASA), తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (TASA) , దక్షిణాఫ్రికా తెలుగు సంఘం (SATC) సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం కోలాహలంగా సాగింది . పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రవాస తెలుగు బాల,బాలికలు , మహిళలు పాడిన పాటలు, పద్యాలతో ఆహూతులను అలరించాయి.
తెలుగు సాహిత్యం , తెలుగు వ్యాకరణం లోని పలు ప్రశ్నలతో సాగిన తెలుగు క్విజ్ కార్యక్రమం ఆకట్టుకుంది. పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని , తెలుగు సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇటీవల నిర్వహించిన పద్యాలు, ఉపన్యాసాల పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు, నిర్వాహకులు బహుమతులు, ధ్రువపత్రాలు, పోటీల్లో ఆసక్తిగా పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.