KTR | అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఎన్నారైలను చూసి తెలంగాణ తల్లి గర్విస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమెరికాలోని డాలస్ నగరంలోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు, బీఆర్ఎస్ రజతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఎన్నారైలు పెద్దసంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాల నాడు తెలంగాణ గడ్డమీద ఎలాంటి ఉత్సాహం కనిపించిందో ఇవాళ డాలస్లో కూడా అదే జోష్ కనిపిస్తుందని అన్నారు. ఇవాళ జరుగుతున్నది ఒక వేడుక మాత్రమే కాదు.. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సర్వస్వాన్ని ధారపోసిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకునే సందర్భం ఇది అని అన్నారు.
‘ అభివృద్ధి, ఆత్మ గౌరవం, తెలంగాణ అస్తిత్వ లక్ష్యాల సాధన కోసం 20 సంవత్సరాల క్రితం ఒక స్వప్నం చిగురించింది. తెలంగాణ ప్రజల పోరాటాలతోనే చరిత్ర సృష్టించబడింది. తెలుగువారికి రెండు రాష్ట్రాలు కాదు, మూడు రాష్ట్రాలు ఉన్నాయని టెక్సాస్ ను చూస్తే అనిపిస్తోంది.’ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను జరుపుకుందాం అనుకున్నప్పుడు తెలంగాణ ఎన్నారైలు ఏకగ్రీవంగా సూచించిన నగరం డాలస్ అని తెలిపారు. ఇవాళ తనకు అమెరికాలో ఉన్నట్టు అనిపించడం లేదని. వేలాదిగా తరలివచ్చిన ఎన్నారైలు, వాళ్ల ఉత్సాహాన్ని చూస్తుంటే హైదరాబాద్లో ఉన్నట్టే అనిపిస్తుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2015లో పెట్టుబడుల కోసం డాలస్ నగరానికి వచ్చానని గుర్తుచేశారు. ఆనాడు ఆత్మవిశ్వాసంతో.. భవిష్యత్తు మీద నమ్మకంతో.. తెలంగాణ తరఫున కేసీఆర్ దూతలుగా మేము చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చడంతో పాటు చెప్పనివి కూడా ఎన్నో చేసి చూపించినందుకు గర్వంగా అనిపిస్తుందన్నారు.
జీవితంలో కలలు చాలా మంది అంటారు. కానీ కొందరే సాకారం చేసుకుంటారని కేటీఆర్ అన్నారు. ‘ ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో, గుండె నిబ్బరంతో, తమ నమ్మకాన్ని పెట్టుబడిగా మలిచి స్వశక్తితో పైకి ఎదగడాన్ని చాలామంది అమెరికన్ డ్రీమ్ అంటారని.. మీరు ఎలా అయితే ఒక స్వప్నాన్ని చూశారో 2001 సంవత్సరంలో ఒక బక్క పలచని మనిషి కూడా ఒక కల కన్నాడు. ఆ కల తన కోసం కాదు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కన్నాడు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తితో.. బోధించు సమీకరించు పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పూర్తిగా.. ఐ హేవ్ ఏ డ్రీమ్ అని గర్జించిన మార్టీన్ లూథర్ కింగ్ స్పూర్తిగా చిమ్మచీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్. శూన్యం నుంచి సునామి సృష్టించి, తెలంగాణ మిషన్ ఇంపాజిబుల్ అన్న పరిస్థితి ని మిషన్ పాజిబుల్ అన్న పరిస్థితికి తెచ్చి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆనాడు కేసీఆర్ పిలుపు మేరకు సకలజనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు.’ అని తెలిపారు.
అమెరికా గడ్డపై కూడా ఎన్నారైలు.. మాతృభూమి కోసం జై తెలంగాణ అని నినదించి తమ పోరాట స్ఫూర్తిని ఘనంగా చాటారని కేటీఆర్ అన్నారు. కుట్రలను ఛేదించి, కుతంత్రాలను ఎదిరించి, అవమానాలను అధిగమించి అవరోధాలను కూకటి వేళ్ళతో పెకిలించి ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో ఏదైతే ఈ సుదీర్ఘ ప్రయాణం జరిగిందో ఇది దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలకమైన రాజకీయ అధ్యాయమని తెలిపారు. మళ్లీ మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని.. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.
‘ ఏ దేశమేగినా.. ఏ పీటమెక్కినా.. పుట్టిన గడ్డ పేరు వినగానే ఎవరికైనా పులకింత కలుగుతుంది. ఇక్కడ డల్లాస్ లో జై తెలంగాణ అని అందరూ నినదించినప్పుడు గుండెలనిండా మన ఆత్మగౌరవం ఆకాశమే హద్దుగా ఉప్పొంగింది.’ అని అన్నారు. ‘ మాతృభూమి మీద మమకారంతో ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రతి ఒక్కరికి వందనం.. అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ తెలిపారు.
పదేళ్లపాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని బరువులా భావించలేదని.. బాధ్యతలా భావించామని తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపినందుకు అనితర సాధ్యమైన ఎన్నో విజయాలు సొంతమయ్యాయని అన్నారు. విడిపోతే విఫల రాష్ట్రం అవుతుందని హేళన చేసిన చోటనే విజయకేతనం ఎగరవేశామని.. మిమ్మల్ని పరిపాలించే నాయకులు ఉన్నారా అని గెలిచేసిన నోళ్ళతోనే మాకు కూడా మీలాంటి నాయకులు ఉంటే బాగుంటుందనిపించామని గుర్తుచేశారు. స్వరాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా కేసీఆర్ నాయకత్వంలో వదులుకోలేదని తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో ఓట్లల్లో వెనుకబడ్డాం కావచ్చు కానీ తెలంగాణను ప్రేమించడంలో ఎన్నటికీ వెనుకబడమని స్పష్టం చేశారు. పొజిషన్లో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా కచ్చితంగా మాకు తెలంగాణ ఫస్ట్, ఇండియానే ఫస్ట్ అని తెలిపారు.
అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఎన్నారైలను చూసి తెలంగాణ తల్లి గర్విస్తుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ మట్టి వాసనను మోసుకొచ్చి అగ్రరాజ్యంలో వెదజల్లుతున్న ప్రతిభావంతులు మీరు.. ఖండాలను దాటి వచ్చి తెలంగాణ జెండాను రెపరెపలాడిస్తున్నది మీ నైపుణ్యమని కొనియాడారు. ‘ మీ విజ్ఞానం మీ దక్షతకు వందనం.. తెలంగాణ రత్నాలు మీరు. భారతజాతి ముద్దుబిడ్డలు మీరు. తెలుగు తేజాలు మీరు. ఉద్యోగాల్లో…వ్యాపారాల్లో… పారిశ్రామిక రంగంలో మీ సత్తాను, సమర్థతను ప్రదర్శిస్తూ వేల మైళ్ల దూరంలో రాణిస్తూ భారత మాత ముద్దుబిడ్డలుగా తెలంగాణ తెలివికి ప్రతీకలుగా నిలుస్తున్న మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.’ తెలిపారు.
నాటి ఉద్యమంలో అయినా.. పదేళ్ల ఉజ్వల ప్రయాణంలో అయినా తెలంగాణ ఎన్నారైలు పోషించిన పాత్ర అద్వితీయమని కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ సువర్ణ అక్షరాలతో మీ పాత్ర లిఖించబడి ఉంటుందని తెలిపారు .ఇక్కడ కనిపిస్తున్న ఆడబిడ్డలు పుట్టిన గడ్డకు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా ఏనాడు బతుకమ్మను మరిచిపోలేదని అన్నారు. బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని కూడా మర్చిపోలేదన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కంటికి రెప్పలా కాపాడుతూ పిల్లలకు భారతీయ సంస్కృతిని నేర్పిస్తున్న ఆడబిడ్డలందరికీ పేరుపేరునా హృదయపూర్వక వందనాలు తెలిపారు.
అమెరికాలో మన విద్యార్థులకు వస్తున్న ఇబ్బందులను తొలగించడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని కేటీఆర్ తెలిపారు. లీగల్ సెల్ ఏర్పాటు చేసి మన విద్యార్థులకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. కేసీఆర్ దూతగా మీకు మాట ఇస్తున్నానని చెప్పారు.. విజ్ఞాన ఆధారిత సమాజాలే ఇవాళ ప్రపంచంలో అగ్రగాములుగా ఉన్నాయని తెలిపారు.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. మార్పు అనివార్యం.. ఆ మార్పుకు మనం అలవాటు పడాలి. దాన్ని ఆస్వాదించాలని సూచించారు. అప్పుడే మనం నిలబడగలుగుతామని అన్నారు.