IT Minister Duddilla | ప్రవాస భారతీయులు తాము పుట్టిన ఊరి మేలుకోసం గ్రామాల పురోగతిలో భాగస్వాములు కావాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేసన్ (జీటీఏ) ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీ ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చెప్పారు. కేరళలో విజయవంతంగా నడుస్తున్న ప్రవాస భారతీయుల సంక్షేమ బోర్డు కంటే గొప్పగా త్వరలో తెలంగాణ ప్రవాస భారతీయుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రవాస భారతీయులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
త్వరలో పెద్దపల్లి జిల్లాలో రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో కోకాకోలా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మూత పడిన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ఏడాది లోపు తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. చెరుకు రైతులకు మేలు చేయడంతోపాటు ఆ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తోపాటు రాష్ట్ర నలుమూలల ఫైబర్ నెట్వర్క్ అందుబాటులో ఉందని చెప్పారు. హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు తీసుకు రావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ రంగ విస్తరణకు తమ సర్కార్ సన్నాహాలు చేస్తుందని మంత్రి దుద్దిళ్ల తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ ను ఏఐ (Artificial Intellegence) రాజధానిగా మార్చడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చైర్మన్ విశ్వేశ్వర్తోపాటు 6టీవీ చైర్మన్ సురేశ్ రెడ్డి, జీటీఏ కోశాధికారి సుధీర్ ముద్దసాని, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమరేంద్ర నంది, వాషింగ్టన్ డీసీ ఉపాధ్యక్షులు కోట్య బానోత్ తదితరులు పాల్గొన్నారు.