హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ( BRS MlAs ) ను సస్పెండ్ ( Suspension ) చేయడాన్ని బీఆర్ఎస్ యూకే నేత కోట్లసాయిబాబా ( Kotla Saibaba ) తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, వెయ్యి రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొంతు నొక్కేందుకు సస్పెన్షన్ను ఆయుధంగా ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షం హక్కు అని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీయడం బీఆర్ఎస్ బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు, వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తదితర బీఆర్ఎస్ నేతలపై నమోదైన లైంగిక వేధింపుల కేసులు రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఆరోపణలు నిజమా కాదా అన్నది దర్యాప్తు, న్యాయస్థానాల పరిధిలో తేలాల్సి ఉన్నప్పటికీ, రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటి కేసులను ఉపయోగించడం తీవ్ర ఆందోళనకరమన్నారు.
బీఆర్ఎస్ నేతలను ప్రజల్లో అప్రతిష్టపాలు చేయడానికి తప్పుడు, కల్పిత ఆరోపణలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రతిపక్షానికి ఉన్న హక్కులను గౌరవించాలని, రాజకీయ కక్షసాధింపులకు స్వస్తి పలికి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.