పురిటిగడ్డ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూనే జీవగడ్డకూ కొంత తిరిగిచ్చేయాలన్న సంకల్పంతో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపాడ్-TPAD) పలు స్వచ్ఛందంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతుంది. ప్రముఖ ఐటీ కంపెనీ ‘ఐటీ స్పిన్’ కేంద్రంగా పద్నాలుగవ రక్తదాన శిబిరాన్ని (Blood Donation) విజయవంతంగా నిర్వహించింది.
పది సంవత్సరాల క్రితం ఏర్పడ్డ టీపాడ్ గడిచిన మూడేళ్లుగా ఏడాదికి రెండుసార్లు రెండుసార్లు రక్తదానం నిర్వహిస్తూ ఇప్పటిదాకా 1,614 మంది ప్రాణాలను కాపాడేందుకు అవసరమయ్యే 540 పింట్ల రక్తాన్ని సేకరించింది. తాజాగా 38 పింట్ల రక్తాన్ని దాతల నుంచి సేకరించి స్థానిక బ్లడ్‌బ్యాంక్ కార్టర్ బ్లడ్కేర్కు అందజేసింది. టీపాడ్ అందిస్తున్న సేవలను కార్టర్ బ్లడ్‌కేర్(Carter Bloodcare) డీఎఫ్‌డబ్ల్యూ మెట్రో ప్రాంత కమ్యూనిటీ చాంపియన్ గా అభివర్ణించింది.
ఈ కార్యక్రమానికి ఫ్రిస్కో అల్లెన్, ఎంసీ కిన్నే, ప్రాస్పర్, ప్లేనో, ఇర్వింగ్, కొప్పెల్ ప్రాంతాల నుంచి రక్తదాతలు తరలివచ్చారు. రత్న ఉప్పల (Ratna Uppala) సమన్వయంతో ఎఫ్‌సీ చెయిర్ జానకీరామ్ మందాడి(Janaki Mandadi) , ప్రెసిడెంట్ రూప కన్నయ్యగారి , బీవోటీ చెయిర్ బుచ్చిరెడ్డి గోలి , కోర్డినేటర్ రవికాంత మామిడి నేతృత్వంలో రక్తదాన శిబిరం జరిగింది. ఏటా రక్తదాతలు సహకరించడం వల్లే తాము కమ్యూనిటీ చాంపియన్లుగా నిలుస్తున్నామని టీపాడ్ ప్రతినిధులు వెల్లడించారు.