జపాన్ : జపాన్లోని టోక్యో నగరం నిషిఓజిమ(Nishiojima) వేదికగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరిగాయి. తాజ్ – తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (TAJ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు ప్రజలతో పాటు భారతీయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులందరూ అత్యంత భక్తితో ఈ పూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
భక్తులందరికీ ప్రత్యేకంగా ప్రసాద వితరణతో పాటు సంప్రదాయబద్ధమైన భోజన ఏర్పాట్లు చేశారు. విదేశీ గడ్డపై ఉన్నప్పటికీ, మన పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. మన సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తాజ్ (TAJ) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిందని నిర్వాహకులు తెలిపారు.