దక్షిణాఫ్రికా, జోహాన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో మొట్టమొదటిసారిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. జొహన్నెస్‌బర్గ్‌లోని భక్తి మార్గ టెంపుల్లో వెలసిన శ్రీ జ్వాల నరసింహ స్వామి దేవాలయంలో శనివారం అత్యంత వైభవంగా స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని భగవంతుడి అనుగ్రహాన్ని పొందారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని గుర్రాల నాగరాజు, ఎల్.ఎన్. శర్మ నేతృత్వంలో ఆద్యంతం భక్తిభావంతో నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ నరసింహ స్వామివారి కల్యాణం శాస్త్రోక్తంగా, మంగళప్రదంగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణలు, భజనలు, భక్తి గీతాల ఆలాపనల నడమ స్వామి వారి వివాహ క్రతువును పూర్తి చేశారు.

ఈ పవిత్ర మహోత్సవం దక్షిణాఫ్రికాలో భారతీయ హిందూ సంస్కృతి వైభవానికి నిదర్శనంగా నిలిచింది. వందలాదిగా తరలివచ్చిన సమస్త భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను తిలకించి.. అనంతరం కల్యాణ భోజనాన్ని ఆరగించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులమయ్యాం అని పులకించిపోయారు.
ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు భక్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా అరవింద్ చికోటి, నరేందర్ రెడ్డి, ఇతర వాలంటీర్ల సేవలు, సహకారం మరువలేనిది. వీరందరి అంకితభావం లేకుండా ఈ కార్యక్రమం ఇంత సజావుగా, అద్భుతంగా జరగడం సాధ్యపడేది కాదు. అందుకని భక్తులు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అలాగే, ఈ పవిత్ర కార్యక్రమానికి వేదిక కల్పించి సమస్త సహాయ సహకారాలు అందించిన భక్తి మార్గ టెంపుల్ యాజమాన్యానికి, సిబ్బందికి నిర్వాహకులు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమస్త భక్తులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహం సదా కలుగుగాక అని నిర్వాహకులు ఆశీర్వాదాలు అందజేశారు.
