Sirijota | శబ్ద కాన్సెప్ట్స్ బ్యానర్ మీద నిర్మించిన లఘు చిత్రం `సిరిజోత`గురువారం రాత్రి సింగపూర్ ఈగల్ వింగ్స్ సినిమేటిక్స్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి కథ, మాటలు సుబ్బు పాలకుర్తి, కవిత కుందుర్తి అందించారు. సురేష్ రాజ్ దర్శకత్వంలో అభిరాం, విజయ భరత్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం యూ-ట్యూబ్ మాధ్యమం ద్వారా శుక్రవారం విడుదల అయింది. తెలుగు భాషా ప్రాముఖ్యతను వివరిస్తూ ఆద్యంతం తెలుగు కోసం పాటుపడే పాత్రల సంఘర్షణలతో రూపుదిద్దుకున్నదీ చిత్రం. ఈ లఘు చిత్రాన్ని వీక్షించిన సింగపూర్‌లోని తెలుగు ప్రముఖులు అభినందనలు తెలిపారు. తెలుగు భాషాభిమానులంతా తప్పక చూడాల్సిన సినిమా సిరిజోత అని పేర్కొన్నారు.
శ్రీ సాంస్కృతిక కళా సారధి అధ్యక్షులు శ్రీ రత్నకుమార్ కవుటూరు, కాకతీయ సాంస్కృతిక పరివారం అధ్యక్షులు శ్రీ రాంబాబు పాతూరి, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు శ్రీ రంగ రవి, సింగపూర్ పోతన భాగవత ప్రచార సమితి అధ్యక్షులు శ్రీ భాస్కర్ ఊలపల్లి, తాస్ అధ్యక్షులు శ్రీమతి అనితా రెడ్డి, అమ్ములు గ్రూపు సభ్యులు శ్రీమతి సునీత తదితరులు ఈ సినిమాను వీక్షించారు. తెలుగు భాష ప్రాముఖ్యాన్ని తెలిపే ఈ లఘు చిత్రాన్ని చూడటం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
సింగపూర్‌లో సినిమా థియేటర్లో తొలిసారి ప్రదర్శించిన తెలుగు తొలి లఘు చిత్రం తమ సిరిజోత అని నిర్మాత పాలకుర్తి సుబ్బు తెలిపారు. తెలుగు భాష ప్రధానంగా నిర్మించిన తొలి చిత్రం కావడం మరింత ఆనందదాయకం అని అన్నారు.