Ghantashala | అమర గాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావుకు భారత్ రత్న అవార్డు ఇవ్వాలని చేపట్టిన సంతకాల సేకరణ ( Signature Campaign ) కు అనూహ్య స్పందన కనిపించింది. ఘంటసాల శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు భారత్రత్న అవార్డు ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ప్రచారోద్యమం చేపట్టారు. ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు సంస్థలను ఏకతాటిపైకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి వరకు 70కి పైగా టీవీ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ నెల 17న సింగపూర్లో రత్న కుమార్ కవుటూరు వ్యాఖ్యాతగా జూమ్ యాప్ నుంచి వర్చువల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో భారత్ నుండి నంది అవార్డు గ్రహీత, ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ ముఖ్య అతిథిగా, గిన్నిస్ బుక్ పురస్కార గ్రహీత కలైమామణి డా. పార్వతి రవి ఘంటసాల అతిధిగా పాల్గొన్నారు.
మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ ఘంటసాల గారి పాటలు విని పెరిగామని, వారి లేని లోటుని ఎవరు భర్తీ చేయలేరన్నారు. ఘంటసాల అంటే గాంధారం అని మాధవపెద్ది అంటే మధ్యమం అని, దాని పక్కనే ఉండేదే పాంచమం అని, ఆ పాంచమమే పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం అని వారి ముగ్గురి మధ్య అనుబంధాన్ని తెలిపారు. అలాగే ఘంటసాలకి మాధవపెద్ది కుటుంబానికి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని నెమరేసుకున్నారు. వారి పాటల్లో వైవిధ్యాన్ని ముఖ్యంగా ఒక శ్యామలా దండకం, శివశంకరి వంటి పాటలు ఇంకో వెయ్యేండ్ల తర్వాత కూడా వారి లాగా ఎవరూ ఆలాపించలేరన్నారు.
పార్వతి రవి ఘంటసాల మాట్లాడుతూ ఘంటసాల కుటుంబానికి కోడలి అవ్వడం తన పూర్వజన్మ అదృష్టం అని తెలిపారు. నిర్వాహుకుల ప్రయత్నానికి అభినందించారు. అందరి ప్రయత్నాలు సఫలం కావాలని, ఘంటసాలను భారత ప్రభుత్వం అతిత్వరలోనే భారతరత్న బిరుదుతో సత్కరించాలని ఆకాంక్షించారు.
అమెరికా నుంచి ఆపి (AAPI) అధ్యక్షులు డా. అనుపుమ గోటిముకుల , విద్యావేత్త-ఆవిష్కర్త, వ్యవస్థాపకుడు డా. బి కె కిషోర్, సేవా ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు స్వదేష్ కటోచ్, బ్రూనై తెలుగు సమాజం అధ్యక్షులు వెంకట రమణ (నాని), తెలుగు అసోసియేషన్ అఫ్ బోత్సవాన అధ్యక్షులు వెంకట్ తోటకూర, మారిషస్ నుంచి ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్, తెలుగు మహాసభ ఆర్గనైజర్ సీమాద్రి లచ్చయ్య తదితరులు ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, ఆ పాటల్లో మాధుర్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఘంటసాలకు భారత్ రత్న అవార్డు కోసం విదేశాల్లోని తెలుగు సంస్థలతోపాటు తెలుగేతర సంస్థలను కలుపుకుని ఏకతాటిపై ముందుకు సాగాలని సూచించారు.
ఇప్పటివరకు అమెరికాలో పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారత్ నుంచి పలువురు ప్రముఖులతోపాటు, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికాల్లోని పలు తెలుగు సంస్థలతో 73 టీవీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు, న్యూజిలాండ్ నుండి శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుండి ఆదిశేషు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కావలసిన సహకారాన్ని ఘంటసాల కృష్ణ కుమారి అందిస్తున్నారు.
ఉగాది పర్వదిన వసంత నవరాత్రులు సందర్భంగా ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు, వివారాలు మీ అందరికోసం:
https://www.change.org/BharatRatnaforGhantasala