హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించబడ్డ అనిల్ కుర్మాచలంకు ఎన్నారై టీఆర్ఎస్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాలా శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు ప్రతిఫలం ఉంటుందని మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. అనిల్ కుర్మాచలంకు స్టేట్ ఫిలిం అండ్ టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నారైలందరి తరపున మహేశ్ బిగాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అనిల్ కుర్మాచలం 1979, మార్చి 8న కరీంనగర్‌లోని రామ్‌నగర్‌లో జన్మించారు. ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన ఆయన.. లండన్‌లో ఐటీ కన్సల్టెంట్‌గా కొనసాగుతున్నారు. దశాబ్దం క్రితం లండన్‌లో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్‌ను స్థాపించారు. అనంతరం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత పర్యవేక్షణలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ చాప్టర్స్‌ను వివిధ దేశాల్లో ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని, పర్యాటకంతో పాటు సాంస్కృతిక రంగాలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇక తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికలో అనిల్ కుర్మాచలం కీలకపాత్ర పోషించారు. అనిల్‌కు భార్య, కుమార్తె ఉన్నారు.