లండన్: బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతిపట్ల లండన్లోని ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ మరణం పార్టీకి, జూబ్లీహిల్స్ ప్రజలకు తీరని లోటన్నారు. ఎన్నారైలతో ఆయనకున్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు సత్య మూర్తి చిలుముల, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల, కార్యదర్శి అబ్దుల్ జాఫర్, కార్యదర్శి- ఐటీ, మీడియా, పీఆర్ రవి ప్రదీప్ పులుసు, కోశాధికారి సురేష్ బుడగం, ఈవెంట్స్ ఇంచార్జ్ తరుణ్ లునావత్, టాక్ సభ్యులు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, శైలజ జెల్లా, శ్రీ విద్య, క్రాంతి రేటినేని పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. మాదాపూర్లోని స్వగృహంలో గురువారం ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు ఏఐజీ దవాఖానలో చేర్చి మూడురోజులుగా చికిత్స అందించారు. పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్తానంలో అంత్యక్రియలు పూర్తిచేశారు.