సంస్కృతీ, సాంప్రదాయాలకు తెలంగాణ పెట్టింది పేరని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. యావత్ ప్రపంచంలో ఎక్కడా.. ఏ జాతికి లేని సాంస్కృతిక వారసత్వం ఒక్క తెలంగాణాకు మాత్రమే ఉండడం మన అదృష్టమని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధించే అద్భుతమైన బతుకమ్మ సంప్రదాయం మనదగ్గర మాత్రమే ఉందన్నారు. ఆ బతుకమ్మ వారసత్వాన్ని కొనసాగించే గురుతరమైన బాధ్యత నేటి తరంపై ఉందని చెప్పారు. అమెరికాలోనీ న్యూజెర్సీలో మూడురోజులుగా జరుగుతున్న తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీటీఏ ) మేఘా కన్వెన్షన్‌ను న్యూజెర్సీ కన్వెన్షన్ కేంద్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు.
టీటీఏ ప్రతినిధి ఫైళ్ల మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, వారసత్వంగా వచ్చిన సంస్కృతీ, సాంప్రదాయాలను వర్తమానానికి అందించాలని ఆయన కోరారు. ఇందులో ప్రవాసులు ముందుండాలన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తెలంగాణ ఉనికిని అమెరికాలో చాటేందుకుగానూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ముందుకుపోతున్న టీటీఏను ఆయన అభినందించారు. కార్యక్రమం అనంతరం జగదీశ్‌రెడ్డిని తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీఏ ప్రస్తుత చైర్మన్ మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నంద్యాల దయాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.