Maha Rudra Yagam | కెనడాలోని ఒంటారియో బ్రాంప్టన్ నగరంలో కొత్తగా గౌరీ శంకర్ మందిరం నిర్మాణం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 12-14 మధ్య మహా రుద్ర యాగం నిర్వహించారు. 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్నది.
ఈ కార్యక్రమం జీఆర్డీ అయ్యర్స్ గురుకుల్ వ్యవస్థాపకులు రమేష్ నటరాజన్, ఆయన సతీమణి గాయత్రీ నటరాజన్ ఆధ్వర్యంలో జరిగింది.
మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో జీఆర్డీ అయ్యర్స్ బృంద సభ్యులు శ్రీ రుద్ర పఠనం, మహా గణపతి హోమం, రుద్ర ఘన పాఠం, తదితర వేద మంత్రాల పారాయణం చేశారు.వేద పఠనంతోపాటు శ్రీ విద్యా నవావరణ పూజ, శ్రీరుద్ర హోమాలు కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన బ్రాంప్టన్ నగర మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్, బ్రాంప్టన్ నగర కౌన్సిలర్ డెన్నిస్ కీనన్ నిర్వాహకులను అభినందించారు.
మహిళలు కూడా వేద పఠనం, హోమాలు చేయడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా రమేష్ నటరాజన్ మాట్లాడుతూ `మా బృందం ఇటీవలే అట్లంటాలో అతి రుద్రం నిర్వహించింది. ఆ వెంటనే గౌరీ శంకర్ మందిర నిర్మాణం నేపథ్యంలో ఈ మహా రుద్రం నిర్వహించే అవకాశం రావటం దైవ సంకల్పంగా భావిస్తున్నాం. మందిర యాజమాన్యం వారి సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమం సఫలీకృతం అయింది. అతి త్వరలోనే ఈ భవ్య మందిర నిర్మాణం పూర్తి చేసుకుని, నూతన ప్రాంగణంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలనేదే మా ఆకాంక్ష` అని తెలిపారు.
గౌరీ శంకర్ మందిరం ఆచార్యులు ధీరేంద్ర త్రిపాఠి మాట్లాడుతూ రమేష్ నటరాజన్, ఆయన బృంద సభ్యులు వేద పఠనం, మహా రుద్ర యాగం ఎంతో ఘనంగా నిర్వహించారని, కుల, ప్రాంత, వర్గ, స్త్రీ పురుష భేదాలు లేని వారి విద్వత్తు, నిబద్ధత ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు.
నూతన మందిర నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తామని, ఇందుకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి ధీరేంద్ర త్రిపాఠి ధన్యవాదాలు తెలియజేసారు.