KTR : తెలంగాణ అభివృద్దికి ఎన్నారైలు కలిసి రావాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస భారతీయులతో సంక్రాంతి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ నగరంలో ప్రవాస భారతీయులు జనవరి 15న (ఆదివారం) నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రవాస భారతీయులు ఇచ్చే మద్దతు గొప్పగా ఉంటుందని అన్నారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రచారం చేసి, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేయాలి అని ఆయన కోరారు.
కేసీఆర్ నాయకత్వంలో..
స్వపరిపాలన కావాలని ఉద్యమం చేశామని, రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, తెలంగాణ సమగ్ర, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేశామని, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని, హరిత హారంతో రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతం పెరిగిందని మంత్రి వెల్లడించారు. అంతేకాదు ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రజలకు మంచి చేస్తుంటే కొందరు అప్పు, తప్పు అంటున్నారని, భారత దేశ సామాజిక ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేనివాళ్లు పేదలకు ఇచ్చే పథకాలను ఉచిత తాయిలాలు అంటూ హేళన చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. 8 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం చేసింది ఏంటని మంత్రి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రవాస భారతీయలు పాల్గొన్నారు. స్విట్జర్లాండ్లో జనవరి 16 నుంచి 20వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనుంది.