Singapore | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. కిండల్ కిడ్స్ పాఠశాల సభామందిరంలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు సశాస్త్రీయంగా కల్పోక్తరీతిలో ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో వినాయక షోడషోపచార, ఏకవింశతి, దూర్వాయుగ్మ, అష్టోత్తర శతనామావళి పూజలతో పాటు , వినాయకోత్పత్తి, శమంతకమణోపాఖ్యానం వంటి కథా శ్రవణాలతో కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.
సుస్మిత కొల్లి అందర్నీ ఆకట్టుకునేలా పూజా వేదికను అలంకరణ చేశారు. విద్యార్థి బృందం దేవుని పాటలతో అందరినీ అలరించింది. పూజ అనంతరం అందరికీ ప్రసాద వితరణ జరిగింది. అనంతరం నిర్వహించిన గణపతి లడ్డూ వేలంలో లక్ష్మి – కరణ్ దంపతులు లడ్డూను దక్కించుకున్నారు. కార్యక్రమం నిమజ్జనంతో ముగిసింది.
ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న పిల్లలు, ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులకు కార్యక్రమ నిర్వాహకులు సుప్రియ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు, పెద్దలు ప్రత్యక్షంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఫేస్బుక్, యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా 7,500 మందికి పైగా వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు సమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు.
తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం దైవసంకల్పం అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రకృతి విపత్తుల నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రధానంగా సహకరించిన కిండల్ కిడ్స్ పాఠశాల యాజమాన్యానికి, విగ్రహ దాతలు పుట్టి ప్రసాద్, ముద్దం విజ్జేందర్, తాటిపల్లి విజయబాబు, కొత్తమాసు రాజశేఖర్ కు, పూజారి శ్రీ శ్రవణ్ బల్కికి, ప్రసాదాలు అందించడానికి సహకరించిన దాతలకు, కమిటీ సభ్యులకు, సేవాదళ కార్యకర్తలకు గౌరవ కార్యదర్శి అనిల్ కుమారి పోలిశెట్టి కృతజ్ఞతలు తెలిపారు.
Singapore Ganesh1
Singapore Ganesh7