NRI | దుబాయ్‌లో అక్టోబర్ 11న నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు హాజరుకావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను గల్ఫ్ తెలంగాణ ఫోరం (GTF) ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గల్ఫ్ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు ఆకుల సురేందర్ ప్రతినిధి బృందం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, బతుకమ్మ వేడుకల ఆహ్వాన పత్రికను అందజేసింది. అనంతరం మహేష్ బిగాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ప్రత్యేక ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను గల్ఫ్ దేశాల్లోని పలు తెలంగాణ సంఘాలు ఘనంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. అక్టోబర్ 11న దుబాయ్‌లో గల్ఫ్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల నుంచి 7:30 గంటల వరకు, అనంతరం ETCA ఆధ్వర్యంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు బతుకమ్మ వేడుకలు జరుగుతాయని వెల్లడించారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ కేటీఆర్ పాల్గొంటారని మహేష్ బిగాల తెలిపారు. ఈ కార్యక్రమంలో జయంత్ కుమార్, అభినవ్, ఆకుల కళ్యాణ్, లత తదితరులు పాల్గొని కేటీఆర్‌ను కలిశారు.