డల్లాస్: బీఆర్ఎస్ పార్టీ (BRS) రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ (Dallas) ముస్తాబవుతున్నది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 డల్లాస్‌లోని డీఆర్ పెప్పర్ అరేనా (DR Pepper Arena) వేదికగా జరుగనున్న ఈ సంబురాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ ఆధ్యర్యంలో అనిల్ గ్రంధి నివాసంలో డల్లాస్ ప్రముఖులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో దయాకర్ పూసుకురి, సతీష్ ఏటీఏ, వంశీ రెడ్డి టీటీఏ, రాజ్ పెరిగేలా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేస్తామని, అందరిని కలుపుకుని వెళ్తామని అంతా ముక్త కంఠముతో చెప్పారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరుకానున్నారని మహేష్ బిగాల వెల్లడించారు. హైదరాబాద్‌ని డల్లాస్‌లా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ అంటూ ఉంటారని, ఎంత మంది ప్రముఖులతో మాట్లాడినా డల్లాస్ని మించి అభివృద్ధి గత తెలంగాణ ప్రభుత్వం చేసిందన్నారు. అందరూ ఈ సభ గురించి ఎదురు చూస్తున్నారని, ఇప్పటికే వేలాది మంది ఈ సభకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. డల్లాస్‌లో ఎంతో మంది తెలుగు వాళ్లు ఉన్నారు, డల్లాస్ పురం అని పిలుచుకునే ఇక్కడ అందరూ వచ్చి పెద్దఎత్తున విజయవంతం చేయాలని పిలుపినిచ్చారు. అలాగే డల్లాస్ తరువాత మిగిలిన దేశాల్లోనూ బీఆర్ఎస్ రజతోత్సవ వేడులకు జరుపుకుంటారని తెలిపారు.
అమెరికాలోని వివిధ రాష్ట్రాల బీఆర్ఎస్ మద్దతుదారులు, అనుబంధ సంఘాలు ఈ కార్యక్రమాన్ని సమన్వయపూర్వకంగా నిర్వహించనున్నాయని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ అన్నారు. ఇది అమెరికాలో బీఆర్ఎస్ చరిత్రలో మైలురాయిగా నిలిచే వేడుక అవుతుందని చెప్పారు.