హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): భారత్ మాతాకీ జై అంటూ గొంతులు చించుకొనే నేతలు తెలంగాణలో న్యాయం కోసం ఓ ఆడబిడ్డ కన్నీళ్లు కారుస్తుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ నేత శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. భేటీ బచావో అని నినదించేవాళ్లు కేంద్ర మంత్రి కొడుకుపై నమోదైన పోక్సో కేసుపై స్పందించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని నిలదీశారు.
బాధితులకు అండగా నిలిచి నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిన రేవంత్ ప్రభుత్వం చేష్టలుడిగి చూడడం సిగ్గుచేటని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. పాలకుల తీరుతో తెలంగాణ గుండె మండుతున్నదని చెప్పారు.
తనను బద్నాం చేస్తున్నారని ప్రధాని మోదీ సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తన కొడుకు బాలికను వేధించినట్టు పక్కా ఆధారాలు, రుజువులు లభించినా బుకాయించడం ఎంతవరకు సమంజసమని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. దేశం కోసం.. ధర్మం కోసం అని నీతులు చెప్పే ఆయన తప్పు చేసిన కొడుకును వెనుకేసుకురావడం బాధాకరమని పేర్కొన్నారు.