జోహన్నెస్‌బర్గ్ : బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా శాఖ (BRS NRI South Africa) ఏర్పడి ఏడు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తెలంగాణ స్ఫూర్తిని ప్రపంచానికి పరిచయం చేస్తూ వివిధ సామాజిక సేవలో అగ్రగామిగా నిలిచిందని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ( President Nagaraju) వెల్లడించారు.
2018 జూలై 14న మిడ్రాండ్లో( Midrand) ప్రారంభమైన బీఆర్ఎస్ తెలంగాణ సంస్కృతిని, నాయకత్వ విలువలను, భాషా, బతుకుదెరువు, గౌరవాన్ని నిలుపుకునే విధంగా ముందడుగు వేశామన్నారు. ఈ ఏడేండ్ల కాలంలో కేరళ వరద బాధితులకు విరాళం, మిడ్రాండ్ పోలీస్ స్టేషన్లో రేప్ బాధిత మహిళలకు ‘డిగ్నిటీ పింక్ కిట్స్’ పంపిణీ , పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు కొవ్వొత్తుల ర్యాలీ , ఘన నివాళి , తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 2019, 2020 సంవత్సరాల్లో జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్, డర్బన్ , ఖమ్మంలో చారిటీ డ్రైవ్స్ ను నిర్వహించామన్నారు.
జోగినపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా సౌతాఫ్రికాలో మొక్కలు నాటడం
, కోవిడ్ సమయంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ, తండాల ప్రజలకు అవగాహన కల్పించడం, పోలీస్ స్టేషన్లకు సహాయం అందించామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు దక్షిణాఫ్రికాలో చిక్కుకున్న సందర్భంగా కేటీఆర్, కవిత సహకారంతో నిత్యావసరాల పంపిణీ, భారత కాన్సులేట్ ద్వారా సహాయం అందించామని వెల్లడించారు.
వరంగల్ ప్రకృతి విపత్తు సమయంలో బ్లాంకెట్లు , కూరగాయల పంపిణీ, తెలంగాణ భాషా దినోత్సవం , సంస్కృతిక కార్యక్రమాలు ప్రవాస భారతీయులకు గుర్తుండిపోయేలా నిర్వహించామన్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మద్దతుతో బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ప్రపంచవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విస్తరణలో కీలకమైన పాత్ర పోషించిందన్నారు. ఈ ప్రయాణంలో భాగస్వాములైన ప్రతి కార్యకర్త, నాయకుడు, సహాయదాత , అభిమానికి ధన్యవాదాలు తెలిపారు.