Nagarju Gurrala : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల (Gurrala Nagarju) అన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సంతోష్‌కు నోటీసులివ్వడం తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని, ఇది న్యాయపరమైన దర్యాప్తు కంటే, పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరుగుతున్న చర్యగా మేము భావిస్తున్నామని ఆయన మండిపడ్డారు.
ప్రజాసేవలో నిరంతరం నిబద్ధతతో పనిచేసిన సంతోష్ కుమార్‌పై ఎలాంటి ఆధారాలు లేకుండా, రాజకీయ ఒత్తిళ్లతో నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని నాగరాజు అన్నారు. ‘అధికారంలో ఉన్నవారు దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం దురదృష్టకరం. BRS పార్టీపై, మా నాయకులపై జరుగుతున్న ఈ విధమైన దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టం తన పని తాను చేయాలి గానీ రాజకీయ ప్రేరణలతో వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం సమంజసం కాదు.
న్యాయం మీద, న్యాయవ్యవస్థ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. నిజం తప్పకుండా బయటపడుతుంది. ఈ తరహా చర్యల ద్వారా ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించాలన్న ప్రయత్నాలు ఫలించవు. BRS NRI దక్షిణాఫ్రికా విభాగం తరఫున మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు మేము ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటాం’ అని గుర్రాల నాగరాజు పేర్కొన్నారు.