NRI News | రాష్ట్ర సచివాలయం, అమరజ్యోతి మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లండన్లో బీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలంతా ముక్తకంఠం తో వ్యతిరేకిస్తున్నారని బీఆర్ఎస్ ఎన్నారై సెల్ అధ్యక్షుడు, ఎఫ్డీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం కోసం 2023 జూలైలోనే అప్పటి సీఎం కేసీఆర్.. ఈ స్థలాన్ని ఎంపిక చేశారని బీఆర్ఎస్ ఎన్నారై సెల్ అధ్యక్షుడు, ఎఫ్డీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం చెప్పారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ తల్లిని అవమానించడమే కాక తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచారని అనిల్ కుర్మాచలం ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కి రేవంత్ రెడ్డి కి ప్రజలు తగిన బుద్ది చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యను తెలంగాణ మేధావులు ఉద్యమకారులు సహించబోరని బీఆర్ఎస్ ఎన్నారై యూకే సెల్ ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ నిర్ణయించిన చోట ప్రతిష్టిస్తామన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు పంపడం ఖాయమని నవీన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ సీనియర్ నాయకులు హరి గౌడ్, రవి ప్రదీప్ పులుసు, సురేష్ బుడగం పాల్గొన్నారు.