న్యూజెర్సీ: అమెరికాలోని న్యూ జెర్సీలో శ్రీనివాస్ జక్కిరెడ్డి, భాస్కర్ పిన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారిన తర్వాత ఇది మొట్టమొదటి సభ. ఈ సభకు ముఖ్య అతిథిగా మహేష్ బిగాల హాజరయ్యారు. అయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్నంత అభివృద్ధి ఏ రాష్ట్రంలో జరగడం లేదన్నారు. కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం దేశానికే తలమానికంగా మారిందని చెప్పారు. తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని, బీఆర్ఎస్తో దేశంలో భారీ రాజకీయ మార్పులు వస్తాయని అన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమని చెప్పారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి దేశానికే ఆదర్శమని, వచ్చే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం స్థాపితమవుతుందని మహేశ్ బిగాల పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాష్ట్రాల ఎన్నారైలను ఏకం చేస్తామని, పార్టీని మరింత బలోపేతం చేస్తామని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూఎస్ఏ లీడర్లు శ్రీనివాస్ జక్కిరెడ్డి (న్యూజెర్సీ అండ్ న్యూయార్క్), భాస్కర్ పిన్న (డెలావేర్), శ్రీశైలం గదాసు, కిరణ్ తోట, శ్రీనివాస్ మేలి, ప్రశాంత్, మహేశ్ పాల్గొన్నారు.