హైదరాబాద్ : అసెంబ్లీ వేదికగా భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతామని తెలిపిన సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు బంధువుగా మారాడాని ఎన్నారై టీఆర్ఎస్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు.
కాగా, భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ చరిత్రలో నిలిచిపోతారన్నారు. అద్భుతమైన పాలనతో సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖ్యాతిని దేశ వ్యాప్తంగా చాటుతున్నారని ప్రశంసించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మోదీ ప్రభుత్వం ఏడు సంవత్సరాల కాలంలో కనీసం కోటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిందని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ముందుకు సాగింది. ఆ కల నేడు సాకారం అయిందన్నారు. నియామకాల విషయంలో 95% స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నారైల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.