Bathukamma | జోహానెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలోని తెలంగాణ ప్రవాస భారతీయులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జోహానెస్‌బర్గ్ నగరంలోని, శాన్‌డౌన్ హైస్కూల్లో జరిగిన ఈ వేడుకకు, తెలంగాణ వాసులే కాకుండా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు, అక్కడి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా(TASA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణ అడపడుచులందరూ, తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా పిల్లలు, పెద్దలు నృత్యాలు, ఆటపాటలతో అలరించారు. ఈ వేడుకల్లో జానపద కళాకారులైన మౌనిక యాదవ్, హనుమంత్ యాదవ్ పాల్గొని తమ జానపద పాటలతో ఉర్రూతలూగించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారతీయ కాన్సులేట్ జనరల్ మహేష్ కుమార్ తెలంగాణవాసులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, తెలంగాణకు గర్వకారణమైన బతుకమ్మ పండుగ సంబరాలు, ఇంత గొప్పగా సౌతాఫ్రికాలో జరగడం గర్వకారణం అని పేర్కొన్నారు. TASA ఎప్పుడూ భారతీయ కాన్సులేట్ నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుందని, ఈరోజు ఇంత గొప్ప వేడుకను ఘనంగా నిర్వహించడం నిజంగా గర్వించదగ్గ విషయం అని, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా సభ్యులందరినీ అభినందించారు. TASA బృందం ప్రదర్శించిన, తెలంగాణ గొప్పతనాన్ని చాటిచెప్పే “తెలంగాణ డాక్యుమెంటరీ” వీడియోని వారు ఎంతగానో అభినందించారు.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు మురళీ బండారు మాట్లాడుతూ, “బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ప్రతీ ఏటా బతుకమ్మ పండుగను ఎంతో ఉత్సాహంగా, ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది మన తెలంగాణ సంస్కృతికి మనం ఇచ్చే గౌరవానికి నిదర్శనం” అని తెలిపారు. ఇన్నేళ్లుగా బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడంలో, ఎంతో మంది దాతల సహకారం ఉంది అన్నారు. తెలంగాణ ఆడపడుచుల కృషి, వారి కుటుంబసభ్యుల సహకారం, దాతల సహకారం మరవలేనిదని, ఈ సందర్భంగా దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలంగాణ ప్రజలు తమ మూలాలను, సంస్కృతిని మరిచిపోకుండా ప్రతి ఏడాది ఇలా బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం అని ప్రవాసులంతా పేర్కొన్నారు.