మెల్బోర్న్ : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జి అనిల్ బైరెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నల్లగొండ పర్యటన సందర్భంగా జగదీశ్‌రెడ్డిపై చేసిన విమర్శలని ఖండించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందుండి కొట్లాడడమే కాకుండా, నల్గొండ జిల్లాని మంత్రి హోదాలో ఎంతో అభివృద్ధి చేసిన జగదీశ్‌రెడ్డిపై చిల్లర వ్యక్తిగత విమర్శలు చెయ్యడం సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
జిల్లా పర్యటనలు చేసినప్పుడు ప్రజలు సీఎం నుండి అభివృద్ధిని ఆశిస్తారని కానీ, రేవంత్ రెడ్డి దానికి భిన్నంగా రోజు రోజుకి తన స్థాయి మరిచి సంస్కారహీనంగా మాట్లాడే దాంట్లో తనకు తానే పోటీ పడి మాట్లాడి ప్రజల్లో చులకన అవుతున్నారని ఎద్దేవా చేశారు. పేరుకే నల్గొండ కాంగ్రెస్‌లో పెద్ద నాయకులు ఉన్నారని, వారి వల్ల ఏమీ ఉపయోగంలేదని, కానీ జగదీశ్‌రెడ్డి ఒక్కడే ఇతర నాయకులని కూడా ముందుండి నడిపించి నల్గొండ ప్రజల కష్టాలు తీర్చాడని వివరించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల పై దృష్టి పెట్టాలని, రానున్న రెండు సంవత్సరాలైనా ఇచ్చిన హామీలని అమలు చేసే విధంగా పని చెయ్యాలన్నారు.