80 వేల బృహత్ ఉద్యోగ నియామక ప్రకటన వెలువడిన నేపథ్యంలో యువతీ యువకులు కాంపిటేటివ్ కసరత్తు మొదలుపెట్టారు. కామారెడ్డి జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ఎటుచూసినా సీరియస్‌గా ప్రిపేరవుతున్న ఉద్యోగార్థులే కనిపిస్తున్నారు.
-విద్యానగర్, మార్చి 11
ఉద్యోగ ప్రకటన వెలువడనుండడంతో నిరుద్యోగ యువత కసరత్తు మొదలుపెట్టింది. తమ కలను సాకారం చేసుకునేందుకు పోటీ పరీక్షల పుస్తకాలతో కుస్తీ పడుతున్నది. ఎలాగైనా జాబ్ సాధించాలనే పట్టుదలతో నిరుద్యోగులు గ్రంథాలయాల బాట పడుతున్నారు. ప్రిపరేషన్ కోసం వచ్చే నిరుద్యోగులు, విద్యార్థులతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం కిటకిటలాడుతున్నది. ప్రశాంతమైన వాతావరణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుతున్నారు. ఆర్థిక స్థోమత సరిగాలేక స్వతహాగా ప్రిపేర్ అయ్యే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయంలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. పోటీ ప్రపంచంలో యువతకు కావాల్సిన పుస్తకాలను గ్రంథాలయాల్లో ఏర్పాటు చేసింది. ఉద్యోగార్థుల తాకిడితో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు గ్రంథాలయాన్ని తెరిచి ఉంచుతున్నారు.
కామారెడ్డిలోని జిల్లా కేంద్ర గ్రంథాల యం 1958 సంవత్సరంలో ఏర్పడింది. ఈ గ్రంథాలయంలో సుమారు 50వేల పుస్తకాలు ఉన్నాయి. రూ.90లక్షలతో రెండంతస్థుల భవనాన్ని నిర్మించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కార్పొరేట్ సొబగులతో గ్రంథాలయాన్ని తీర్చిదిద్దారు. సుమారు 450మంది చదువుకునే అవకాశం ఉన్నది. జిల్లా నలుమూలల నుంచి ప్రతి రోజూ 400మంది పాఠకులు గ్రంథాలయానికి వస్తుంటారు. మినరల్ వాటర్‌తోపాటు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. సుమారు 10 కంప్యూటర్లతో కూడిన ల్యాబ్ ఉన్నది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం త్వరలోనే భోజన వసతి ఏర్పాటు చేయనున్నది.
ఉద్యోగార్థులు చదువుకునేందుకు గ్రంథాలయంలో అన్నిరకాల వసతులు ఏర్పాటు చేశాం. సుమారు 50వేల పుస్తకాలున్నాయి. ఇంకా అవసరమైన పుస్తకాలను తెప్పిస్తాం. కోచింగ్ సెంటర్‌కు వెళ్లకుండా ఇక్కడే చదివి ఉద్యోగం సాధించేలా అన్ని వసతులు కల్పించాం. దూరప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం త్వరలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయనున్నాం. నిరుద్యోగుల కోసం ఉదయం 8నుంచి రాత్రి 8గంటల వరకు గ్రంథాలయ సమయం పెంచాము. సెలవు దినాల్లో కూడా గ్రంథాలయం తెరిచి ఉంచుతాం.
-పున్న రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్, కామారెడ్డి
కోచింగ్ సెంటర్ క న్నా ఇక్కడే మంచి గా చదువుకుంటున్నాము. నేను డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు, బేసిక్ నాలెడ్జ్‌కు సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి. మాకు ఎలాంటి లోటురాకుండా అన్ని పుస్తకాలను సమకూర్చారు.
-సుకన్య, డీఎస్సీ అభ్యర్థి, కామారెడ్డి
నేను గతంలో కోచింగ్ తీసుకున్నా. సంతృప్తిగా అనిపించలేదు. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జాబ్ వస్తదనే నమ్మకం ఏర్పడింది. ఇక్కడ పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రిపరేషన్ బాగానే జరుగుతున్నది.
-సురేశ్, గ్రూప్-3 అభ్యర్థి, కామారెడ్డి
మేము చదువుకోవడానికి గ్రంథాలయంలో అన్ని వసతులతోపాటు కావాల్సిన పుస్తకాలను అందిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే చదువుకోవడానికి వీలు కల్పించడం చాలా ఆనందంగా ఉంది. ఈసారి ఎలాగైనా జాబ్ సాధించాలనే తపనతో కృషి చేస్తున్న.
-ఝాన్సీ, ఎఫ్ఆర్వో అభ్యర్థి, కామారెడ్డి
ఈ గ్రంథాలయంలో ఎంత సేపు చదివినా బ్రేక్ తీసుకోవాలని అనిపించడం లేదు. నేను ఎస్సై జాబ్‌కు ప్రిపేర్ అవుతున్న. జాబ్ కొట్టాలంటే చాలా కష్టపడాలి. ఇంట్లో సరిగ్గా చదవలేకపోతున్న. కానీ ఇక్కడ చాలా సమయం కేటాయిస్తున్న.
-సాయివిఘ్నేశ్, ఎస్సై అభ్యర్థి, రాజంపేట్