లింగంపేట, జనవరి 5: ఇంటి నిర్మాణానికి ఆన్లైన్లో లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవడంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు లు, కుటుంబీకుల కథనం ప్రకారం.. మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి గంగరాజు(28) వడ్రంగి పనిచేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి లింగంపేటలో నివాసం ఉంటున్నాడు. ఇంటి నిర్మాణానికి లోన్ కోసం ఆన్లైన్లో వెతకగా.. బెంగళూర్‌కు చెందిన ఓ కంపెనీ వారు నమ్మబలికారు.
అయితే కొంతమొత్తం చెల్లించాలని సదరు కంపెనీ వారు చెప్పడంతో విడుతల వారీగా వారికి రూ. 52, 500 ఆన్లైన్ ద్వారా పంపించాడు. రు ణం కోసం కంపెనీకి చెందిన వ్యక్తికి ఫోన్‌చేయగా.. తనకు ఏమీ తెలియదని చెప్పడంతో తాను మోసపోయినట్లు గంగరాజు గ్రహించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన గంగరాజు శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్లా డు. శనివారం సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదివారం లింగంపేట ఊర చెరువు తూము వద్ద గంగరాజు చెప్పులు కుటుంబీకులు గుర్తించారు. పోలీసులు గజఈత గాళ్ల సాయంతో గాలించగా గంగరాజు మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య సోనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డికి తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. మృతునికి తల్లి అనసూయ, తండ్రి దర్శన్, కూతురు నవ్యశ్రీ ఉన్నట్లు ఎస్సై తెలిపారు.‘నా చావుకు వాడే కారణం’ అని వాట్సాప్ గ్రూపుల్లో గంగరాజు మెస్సేజ్ పంపినట్లు తెలిపారు.