వినాయక్‌నగర్, జూలై 10: నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం ఓ యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పటించుకునేందుకు యత్నించగా..అక్కడే ఉన్న ట్రాఫిక్ సిబ్బంది నిలువరించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు .. నగరానికి చెందిన బాలాజీ అనే యువకుడు స్థానిక కంఠేశ్వర్‌లోని పాలిటెక్నిక్ గ్రౌండ్ గేటు వద్ద పానీపూరి బండి పెట్టుకొని విక్రయించేవా డు. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమి త్ షా పర్యటన నేపథ్యంలో పానీపూరిబండిని ట్రాఫిక్ పోలీసులు తొలగించారు.
తనకు మళ్లీ కంఠేశ్వర్ వద్ద పానీపూరి బండి పెట్టుకునే అవకాశం కల్పించాలని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అడిగాడు. దీంతో పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సదరు యువకుడు తన వెంట బాటిల్లో తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. దీనిని గమనించిన అక్కడే ఉన్న ట్రాఫిక్ సిబ్బందితోపాటు ఇతరులు యువకుడిని నిలువరించారు. సదరు యువకుడిని పట్టుకొని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని నియంత్రించాల్సింది పోయి, మొబైల్లో వీడియోలు తీయడం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే అలా చేశారని పేర్కొన్నారు.