శక్కర్‌నగర్/ఎల్లారెడ్డి రూరల్/ఆర్మూర్ టౌన్, డిసెంబర్ 13: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతున్నది. ముందస్తు పేరుతో అరెస్టుల పర్వం యథేచ్ఛగా జరుగుతున్నది. డిమాండ్ల కోసం గొంతెత్తుతున్న వారిని అక్రమంగా అదుపులోకి తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న సర్పంచులు, అంతకుముందు ఆశ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా శుక్రవారం మెప్మా రీసోర్స్ పర్సన్ (ఆర్పీ)లను అదుపులోకి తీసుకున్నారు. బోధన్, ఆర్మూర్, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలకు చెందిన ఆర్పీలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్లలో నిర్బంధించారు. మహిళలన్న సంగతి కూడా మరిచిపోయి తెల్లవారుజామునే ఇండ్లలోకి చొరబడి ఠాణాలకు తరలించారు.
తమ సమస్యలు పరిష్కరించాలని మెప్మా రీసోర్స్ పర్సన్లు ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దీంతో డిమాండ్ల సాధన కోసం మెప్మా ఆర్పీలు చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరూ ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆర్పీలను వారి ఇండ్ల నుంచి బలవంతంగా తీసుకెళ్లి పోలీస్స్టేషన్లలో నిర్బంధించారు. అలాగే, ఎల్లారెడ్డి, ఆర్మూర్లోనూ ఆర్పీలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా రీసోర్స్పర్సన్లు మాట్లాడుతూ.. ఏడు నెలలుగా తమకు వేతనాలు లేవని వాపోయారు. అయినా తాము విధులు నిర్వర్తిస్తున్నామని, కానీ ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ ‘చలో హైదరాబాద్’కు పిలుపు ఇచ్చిందని, ఈ క్రమంలో తమను అక్రమంగా ఇండ్ల నుంచి తెల్లవారుజామునే తీసుకొచ్చి స్టేషన్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు నెలకు రూ.20 వేల వేతనం, పీఆర్సీ వర్తింపజేయాలని అన్నారు.