కమ్మర్పల్లి, జనవరి 14: ‘తలాపునే పారుతోంది గోదారి.. మన చేను, మన చెలుక ఎడారి..’ ఇది ఉమ్మడి రాష్ట్రంలో బాల్కొండ నియోజక వర్గంలోని గోదావరి నది చెంతనే ఉన్న ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్‌లో రైతుల పరిస్థితి. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో.. ఉద్యమ దృక్పథంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గోదావరినదికి గుమ్మిర్యాల్ వద్ద ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించారు. లిఫ్ట్ ద్వారా గోదావరి జలాలను అందిస్తుండడంతో గుమ్మిర్యాల్‌లోని చెరువులు ఏడాదంతా జల కళను సంతరించుకొని రెండు పంటలకు పుష్కలంగా సాగు నీటిని అందిస్తున్నాయి. బాల్కొండ నియోజక వర్గంలో గోదావరి ఆధారంగా ఉన్న లిప్టులు ఉమ్మడి పాలకుల హయాంలో నీరు గారి పోతే వాటిని అనతి కాలంలోనే గాడిన పెట్టి ఎత్తిపోతల ఆయకట్టుకు సాగు నీటి కొరత తీర్చిన వేముల ప్రశాంత్‌రెడ్డి.. కొత్త లిప్టులను సైతం అందించి రైతులకు మేలు చేకూర్చారు. కొత్తగా నిర్మించిన గుమ్మిర్యాల్ ఎత్తిపోతల పథకం స్వరాష్ట్రంలో సాగునీటి రంగానికి మంచి రోజులు దక్కాయనడానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
గుమ్మిర్యాల్‌లోని మూడు చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు గతంలో రెండు సీజన్లకు సరిపడా నీరు ఉండేది కాదు. తలాపునే గోదారి ఉన్నా బీడు భూములుగా మారేవి. చెరువుల్లో తగిన నీరు లేక భూగర్భ జలాలు కూడా తగ్గి బోరుబావులు వట్టిపోయేవి. లోవోల్టేజీ సమస్యతో బోరు మోటర్లు కాలిపోయి రైతులు ఖర్చుల పాలయ్యేవారు. 2014లో కేసీఆర్ నేతృత్వంలో సర్కారు ఏర్పడడంతో వేముల ప్రశాంత్‌రెడ్డి గుమ్మిర్యాల లిఫ్ట్‌ను మంజూరు చేయించి నిర్మింపజేశారు. 2017లో ట్రయల్ రన్ ప్రారంభం కాగా.. అప్పటి నుంచి రెండు పంటలకు నీరు అందుతున్నది.
గుమిర్యాల్ ఎత్తిపోతల పథకం ద్వారా గుమ్మిర్యాల్ పరిధిలోని చింతామణి, పచ్చర్ల, కొత్త చెరువులకు నీరు అందుతున్నది. ఫలితంగా చెరువుల కింద ఉన్న ఆయకట్టుతో పాటు 500 ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చాయి. ఏటా చెరువులు నింపుకోవడంతో ఈ చెరువుల సమీపంలో భూగర్భ జలాలు కూడా పెరిగి బోరు బావుల కింద నీటి కొరత లేకుండా పంటలు పండుతున్నాయి. సమీపంలోని దోంచందలో సుమారు 150 ఎకరాల భూములకు పరోక్షంగా సాగు నీటి ప్రయోజనం చేకూరుతున్నది. లిప్టు ద్వారా మొత్తం 1,454 ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. ఐదు వందల రైతు కుటుంబాలకు పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందుతున్నాయి. దీంతో ఐదారేండ్లుగా లిప్టు పరిధిలోని రైతులు ముందస్తుగానే నాట్లు వేసుకుంటున్నారు. రెండు సీజన్లలో వరితో పాటు పసుపు, మక్కజొన్న పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం యాసంగిలో వరితో పాటు మక్కజొన్న, జొన్న పంటలను వేశారు. ఉద్యమ ట్యాగ్ లైన్లలో ప్రధానమైన వాటిల్లో సాగు నీరు ఒకటి. ఈ కోణంలో సీఎం కేసీఆర్, మంత్రి వేముల సహకారంతో చేసిన కృషికి గుమ్మిర్యాల్ ఎత్తిపోతల నిదర్శనంగా నిలుస్తున్నది. ఎత్తిపోతల ఫలితంగా రెండు సాగు సీజన్లతో పచ్చని పంటలు గోదారి సమీపంలో కనిపిస్తున్నాయి.
గుమ్మిర్యాల్ ఎత్తిపోతలను ఏర్పాటు చేయించి గోదారి జలాలను చెరువులు, పొలాలకు అందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషిని రైతులు మరువ లేరు. గతంలో సాగు నీటి ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు గుమ్మిర్యాల్ ఎత్తిపోతలతో సాగు నీటి చింత లేకుండా పంటలు సాగుచేసుకోగలుగుతున్నారు.
– గుల్లే రాజేశ్వర్, జడ్పీటీసీ, ఏర్గట్ల మండలం
దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న సాగు నీటి తిప్పలు గుమ్మిర్యాల్ ఎత్తిపోతలతో దూరమయ్యాయి. ఆరేండ్లుగా సాగు నీటి సమస్య లేకుండా రెండు పంటలు పండుతున్నాయి. మంత్రి ప్రత్యేకంగా కృషి చేసి గుమ్మిర్యాల్ లిప్టు అందించక పోతే రెండు పంటలకు గ్యారంటీ ఉండేది కాదు.
– తంగల్లపల్లి గంగారాం, రైతు, గుమ్మిర్యాల్