అభివృద్ధిలో తెలంగాణ దూసుకు పోతున్నది.. దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నది.. పకడ్బందీ ప్రణాళికలతో ఆర్థిక ప్రగతీ సాధిస్తున్నది. సీఎం కేసీఆర్ దార్శనికత, సంక్షేమ పాలనతో రాష్ట్ర తలసరి ఆదాయం భారీగా పెరిగింది. జాతీయ సగటు కన్నా రాష్ట్ర సగటు అత్యధికంగా నమోదు కావడం విశేషం. ఇక, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల తలసరి ఆదాయం కూడా రూ.లక్షన్నర దాటి పోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆదాయం పెరగడం గమనార్హం. దుర్భిక్ష పరిస్థితుల్లో కొట్టుమిట్టాడిన బతుకులు ఇప్పుడు ఎంతో బాగుపడ్డాయి. సాగు రంగానికి కేసీఆర్ సర్కారు పెద్దపీట వేయడం, దేశం అబ్బురపడే పథకాలు అమలు చేయడంతో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతుండడంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. నిజామాబాద్ జిల్లా ప్రజల తలసరి ఆదాయం రూ.1.67 లక్షలు కాగా, కామారెడ్డి జిల్లాలో కొద్దిగా తక్కువగా రూ.1.55 లక్షలుగా నమోదైంది. రెండు జిల్లాలు ఆదాయ పట్టికలో ముందు వరుసలో ఉన్నాయి.
నిజామాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రం… అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పక్కా వ్యవసాయక ప్రాంతం. సగానికి ఎక్కువ మందికి జీవనాధారం కూడా సాగు రంగమే. ప్రధానమైన ఉపాధి వనరుగా, పల్లెల్లో ప్రజల జీవనాడికి కేంద్రంగా ఉన్నటువంటి వ్యవసాయానికి నూతన జవసత్వాలు కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతున్నది. దుర్భిక్షమైన దుస్థితిలో కొట్టుమిట్టాడిన చోటు నుంచి సుపరిపాలన వెలుగుల వరకు తెలంగాణ ప్రస్థానానికి కేరాఫ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రమే.
రాష్ట్ర అవతరణ వరకు తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రజలు అనేక పట్టికల్లో కింది స్థాయిలో నిలిచేది. గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న అభివృద్ధితో ప్రజల జీవన స్థితిగతులు మారాయి. సగటు తెలంగాణవాసి తలసరి ఆదాయం సైతం అమాంతం ఎగబాకింది. తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే ఏకంగా జాతీయ సగటునే దాటింది. రాష్ట్రంలో ఆయా జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు తలసరి ఆదాయ పట్టికలో మున్ముందుకు దూసుకుపోయాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రజానుకూల విధానాల ఫలితంగా ప్రజల తలసరి ఆదాయం ఎనిమిదేండ్లలో రెట్టింపు అయ్యింది. 2020-21లో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.2.79లక్షలుగా నమోదైంది. కాగా జాతీయ సగటు రూ.1.27లక్షలు మాత్రమే. టీఎస్‌డీపీఎస్ నివేదిక ప్రకారం జిల్లాల వారీగా తలసరి ఆదాయం పరిశీలిస్తే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ పరిస్థితుల్లో భారీ మార్పు కనిపిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో రూ.1.67లక్షలు, కామారెడ్డి జిల్లాలో రూ.1.55లక్షలుగా నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉభయ జిల్లాల్లో ప్రజల తలసరి ఆదాయం అమాంతం రూ.లక్షన్నర దాటుకుని దూసుకు పోతున్నది.
తలసరి ఆదాయంలో పెరుగుదల అన్నది అభివృద్ధికి, ప్రజల జీవన స్థితిని తప్పక తెలియజేస్తుంది. బహిరంగ మార్కెట్లో ప్రజల కొనుగోలు, అమ్మకాల శక్తితో పాటు ఆదాయ వనరుల ద్వారా చేకూరుతున్న ప్రయోజనాలను సైతం తేటతెల్లం చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా తలసరి ఆదాయం ఎప్పుడూ రూ.లక్ష కూడా దాటలేదు. ఇప్పుడేకంగా జిల్లాల పునర్విభజన అనంతర కాలంలో తలసరి ఆదాయంలో భారీ మెరుగుదల కనిపిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. 33 జిల్లాలతో పోలిస్తే తలసరి ఆదాయంలో నిజామాబాద్ జిల్లా 21వ స్థానం, కామారెడ్డి జిల్లా 25వ స్థానంలో నిలిచింది.
రాష్ట్ర అవతరణ తర్వాత జరుగుతున్న పునర్నిర్మాణ పనులన్నీ మామూలుగా జరిగేవి కావు. మలి దశ ఉద్యమంలో ఏ అవసరాల కోసమైతే పోరాటం చేశామో, ఏ డిమాండ్ల కోసం రోడ్డెక్కి నిలదీశామో అవన్నీ ఒక్కోటి సాక్షాత్కారమై ప్రజల ముంగిట నిలుస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు వంటి ట్యాగ్‌లైన్‌కు సార్ధకత చేకూర్చడంతో పాటు అన్ని రంగాల్లోనూ తెలంగాణ సాధిస్తోన్న అభివృద్ధి పరంపర అంతా ఇంతా కాదు. 2001 నుంచి తెలంగాణ సోయితో ఆలోచించే వారు ఉద్యమపథాన దూకి పని చేస్తున్న సందర్భంలో చూసిన దృశ్యాలు, ఘటనలు అన్నీ ఆనాటి ఉద్యమ కండ్లల్లో చెదరని చిత్రాలుగా ఉన్నాయి.
ఉద్యమ సమయంలో వేర్వేరు దారుల్లో విభిన్న వాదనలతో కనిపించిన కన్నీటి ఉద్యమ పుటల స్థితి నుంచి నేటి స్థితిని పోల్చుకున్నప్పుడు జరుగుతున్న పరిణామక్రమమే పునర్నిర్మాణపు పనులకు తార్కాణంగా నిలుస్తున్నది. 70 ఏండ్ల బాధల నుంచి చాలా వరకు బయట పడే దశకు రావడం అన్నది అనుకున్నంత సులువైనది కాదు. అన్నీ ఒక్కసారిగా జరిగిపోవడానికి ఇదేం తాంత్రిక విద్య కాదు. ఎనిమిదేండ్లలో జరిగిన పునర్నిర్మాణ పనులు 70 ఏండ్ల కాలాన్ని వీస్తూ పోయే విధంగా చేసి అనేక విజయాలను కండ్ల ముందు ఆవిష్కరించినట్లు అవుతోంది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 2014కు పూర్వం కేవలం 6లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యేవి. రైతుల చేతుల్లో భూములున్నప్పటికీ పడావుగా వదిలేసేది. ఇందుకు ప్రధానంగా సాగుకు ప్రోత్సాహం అన్నది మచ్చుకూ కనిపించకపోవడమే కారణం. సాగు నీటి కొరత, కరెంట్ కటకట, ఎరువులు దొరక్కపోవడం, విత్తనాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడేది. అప్పో సొప్పో చేసి పంటలపై పెట్టుబడి పెడితే చేతికి వచ్చేది శూన్యంగా ఉండేది. దీంతో అప్పులు తిరిగి చెల్లించలేక వడ్డీలు కట్టలేక, కుటుంబాలను పోషించుకోలేని దీనావస్థలో అన్నదాతలు పడిన మనోవేదన అంతా ఇంతా కాదు. చివరికి భూములు అమ్ముకుని చేసిన రుణాలను విముక్తి చేయించుకోవడమే మిగిలేది.
కొంత మంది ఏకంగా తనువు చాలించి లోకం విడిచిన ఘటనలు అనేకం ఉండేవి. కేసీఆర్ పరిపాలనలో రైతులకే సాగు ఖర్చులకు నగదు అందిస్తుండడం, సాగు నీటి కొరతను తీర్చడం, 24గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో వ్యవసాయ రంగం పరుగులు పెట్టి కర్షక లోకానికి ఆదాయ వనరుగా మారింది. అప్పులు తీరి ఏకంగా లాభాల బాటలో పెరగడం ద్వారా ఉమ్మడి జిల్లాల్లో సగటు వ్యక్తి తలసరి ఆదాయంలో గణమైన మార్పు వచ్చింది.