కామారెడ్డి, ఏప్రిల్ 28: ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు భర్తకే ఎసరు పెట్టింది. కట్టుకున్న వాడిని ఖతం చేసేందుకు రూ.15 లక్షల సుపారీ ఇచ్చింది. దుండగులు హత్యాయత్నానికి పాల్పడుతుండగా అటువైపు కొందరు రావడంతో భర్త తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు భార్య, ప్రియుడితో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగిన ఈ కేసు వివరాలను ఎస్పీ రాజేశ్చంద్ర సోమవారం విలేకరులకు వెల్లడించారు. మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన సాడెం కుమార్ మెదక్ మున్సిపాలిటీలో పని చేస్తున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి సమీపంలోని లలితమ్మ గుడిలో పూజారి కాంపల్లి మహేశ్‌కు, కుమార్ భార్య రేణుకకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే, తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన మహే శ్, రేణుక.. కుమార్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నా రు. అనంతరం అతడి ఆస్తిని అనుభవించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కుమార్ హత్య కోసం అల్వాల్‌కు చెందిన మహ్మద్ అశ్వక్‌కు రూ.15 లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అశ్వక్ అనుచరులైన ముబీన్, అమీర్, అన్వర్, మోసిన్లకు అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు ఇచ్చారు.
కుమార్ రోజులాగే ఈ నెల 21వ తేదీన డ్యూటీకి బయల్దేరాడు. అప్పటికే అశ్వక్ గ్యాంగ్ అతడి హత్యకు ప్లాన్ వేసింది. ఫరీద్‌పేట శివారులోని సోలార్ ప్లాంట్ వద్ద హత్య చేయడానికి అనువుగా ఉంటుందని అక్కడే మాటు వేసింది. కుమార్ రాగానే మహేశ్, అశ్వక్, అతని అనుచరులు ముబిన్, అమీర్, అన్వర్, మోసిన్ కలిసి దాడి చేశారు. రాడ్లతో విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అదే సమయం లో ఓ కారులో వచ్చిన ఇద్దరు హత్యాయత్నాన్ని గమనించగా, నిందితు లు పరారయ్యారు.
గాయపడ్డ కుమార్‌ను కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. దీనిపై ఏఎస్పీ చైతన్యారెడ్డి నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా, భర్త హత్యకు భార్య కుట్ర పన్నిన విషయం వెలుగు చూసిం ది. దీంతో రేణుకతో పాటు మహేశ్, అశ్వక్, ముబి న్, అమీర్‌ను అరెస్టు చేశారు. వా రి నుంచి కారు, ఆటో, గొ డ్డలి, రెండు బైక్‌లు, నాలు గు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. వారం రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, మాచారెడ్డి ఎస్సై అనిల్, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.