బోధన్, ఫిబ్రవరి 23: ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయా వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరిగిన బీజేపీ శాసనమండలి ఎన్నికల ప్రచార సభలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోవడంతో.. ఓట్లు అడిగే సత్తా లేక టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు ఇస్తామని, ఇంటర్నేషనల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని, నిరుద్యోలకు రూ.4 వేలు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు.
ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌కు వెళ్లిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని విమర్శించారు. పట్టభద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలని కోరారు.