PCC Chief Mahesh Kumar Goud | కంఠేశ్వర్, జనవరి 12 : ఎన్నికలు రాగానే దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం బీజేపీకి పరిపాటే అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరాముడు ఏమైనా బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడా అని, దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు ఎలా అడుగుతుందని, శ్రీరాముడి పేరు చెప్పి ఓట్లు అడిగే హక్కు బీజేపీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తాము సైతం శ్రీరాముడు, హనుమంతుడు, ఇతర దేవుళ్లను పూజిస్తామని తాము కూడా హిందువులమేనని స్పష్టం చేశారు.
కేంద్రంలోని బీజేపీ వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్థితి ఉందని, 12 ఏళ్ల పాలనలో బీజేపీ ఏం ఒరగబెట్టిందో చెప్పి ఓట్లు అడగాలి అని ఆయన సూచించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లాకు 30 ఏళ్ల ఇంజనీరింగ్ కళాశాల, అగ్రికల్చరల్ కళాశాల, జిల్లాలో దాదాపు రూ.600 కోట్లతో రోడ్లు అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. నిజామాబాద్ లో మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నామని, మెజార్టీ సర్పంచ్ స్థానాలు గెలుచుకున్న మొదటి ఐదు జిల్లాలో నిజామాబాద్ ఒకటన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఆశాభావం వ్యక్త చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్ వల్ల కొంత మేర నష్టం జరిగిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పక్కా ప్రణాళికలతో పాత, కొత్త నేతలను సమన్వయపరిచి మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని అన్నారు. నిత్యం ప్రజా క్షేత్రంలో ఉన్నవారికి బీ ఫామ్ ఇస్తామని ,ప్రజా పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం చూసి మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశవ వేణు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.