పిట్లం/రుద్రూర్/నిజాంసాగర్/ బిచ్కుంద, జనవరి 6: సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా పిట్లం మండలం కుర్తి,బిచ్కుంద మండలం ఎల్లారం తండా, కోటగిరి మండలంలోని కొత్తపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే రెండు హామీలను ప్రజలకు అందజేశామని తెలిపారు. మిగితా హామీలను కూడా త్వరలో అమలుచేస్తామని స్పష్టం చేశారు. పేదలను ఆదుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో జుక్కల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతారావు, సంజీవరెడ్డి, కలెక్టర్లు జితేశ్ వీ పాటిల్, రాజీవ్‌గాంధీ హన్మంతు, కామారెడ్డి జడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ డీసీవో సంహాచలం, డీపీవో జయసుధ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కౌలాస్ కోటకు నిధులు మంజూరు చేస్తాం
జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామ శివారులో ఉన్న చారిత్రక కౌలాస్ కోటకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో కలిసి కౌలాస్ కోటను సందిర్శంచారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, కౌలాస్ కోట రాజ వంశీకులైన అనూప్ సింగ్, అనితాసింగ్ కౌలాస్ కోట చరిత్రను మంత్రికి వివరించారు. కౌలాస్ కోట చిత్రాలతో కూడిన ఫొటోలను మంత్రికి చూపించారు. ఘన చరిత్ర కలిగిన కోటను పరిరక్షించడమే కాకుండా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.