కంఠేశ్వర్, అక్టోబర్ 8: నిత్యం ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమై ఉండే పారిశుద్ధ్య కార్మికుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యుడు డాక్టర్ పి.పి వావా సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఆయన మంగళవారం కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎక్కడా మాన్యువల్ స్కావెంజర్స్ లేరని, స్కావెంజర్ నిషేధ చట్టం పకడ్బందీగా అమలవుతున్నదని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీలు సహా 530 గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుధ్య కార్మికులు ఇంటింటి నుంచి చెత్తను సేకరించి వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారని వివరించారు.
కార్మికుల పిల్లలకు బెస్ట్ అవైలేబుల్ స్కీం కింద కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచితంగా, నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో చదవడానికి రూ.20 లక్షల వరకు ఆర్థిక చేయూతనిస్తున్నామని వివరించారు. సఫాయి కార్మికులకు సంబంధించి జిల్లాలో గత 16 సంవత్సరాల నుంచి ఎలాంటి అట్రాసిటీ కేసు నమోదు కాలేదని సీపీ కల్మేశ్వర్ తెలిపారు. కేంద్ర సామాజిక న్యాయ విభాగం సభ్యుడు గిరేందర్ నాథ్, కో-ఆర్డినేటర్ చరణ్, అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ మకరంద్, అధికారులు పాల్గొన్నారు.