Rajiv Gandhi Hanumanthu | కంటేశ్వర్, మే 26 : నిజామాబాద్ ను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా, అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. స్వయం సహాయక సంఘాలలోని ప్రతీ సభ్యురాలి విద్యార్హతలు గుర్తిస్తూ, నిరక్షరాస్యులుగా ఉన్న వారికి చదవడం, రాయడం నేర్పించాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్రంలోనే తొలిసారిగా సెర్ప్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, సమగ్ర శిక్ష, వయోజన విద్యా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇందూరు అక్షరలక్ష్మి పేరుతో రూపొందించిన యాప్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఐడీఓసీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి సోమవారం ఆవిష్కరించారు.
సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా యాప్ ను రూపొందించడం పట్ల కలెక్టర్ సంబంధిత అధికారులను అభినందించారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలలో సుమారు 3.40 లక్షల మంది సభ్యులు కొనసాగుతున్నారని కలెక్టర్ గుర్తు చేశారు. ఇందూరు అక్షర లక్ష్మి యాప్ ద్వారా సీ.సీలు, వీ.ఓ.ఏ ల సహాయంతో ప్రతి ఎస్.హెచ్.జీ సభ్యురాలి విద్యా సంబంధిత వివరాలను సేకరించి యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. నిరక్షరాస్యులుగా గుర్తించబడిన వారికి అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామాల్లో అక్షరాస్యతా కేంద్రాలను ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు.
అదేవిధంగా పదో తరగతి లోపు చదువుకున్న వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి పరీక్షలు రాయించడం, ఎస్ఎస్సి ఉత్తీర్ణులైన వారిని ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాయించనున్నట్లు తెలిపారు. గణాంకాల ప్రకారం జిల్లాలో మహిళల అక్షరాస్యత 55 శాతంగా ఉందని, సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం అమలు ద్వారా నూటికి నూరు శాతం మహిళా అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. నిర్ణీత కాల వ్యవధిని నిర్దేశించుకుని, లక్ష్య సాధన కోసం అంకిత భావంతో కలిసి కట్టుగా కృషి చేయాలని హితవు పలికారు. 2026 మార్చి నెలలో జరిగే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల సమయం నాటికి స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులను ఓపెన్ ఎగ్జామ్స్ కు సన్నద్దం అయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు.
సంపూర్ణ అక్షరాస్యత సాధన కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సాయాగౌడ్, ఏ.పీ.డీ రవీందర్, డీఈఓ అశోక్, డీడబ్ల్యూఓ రసూల్ బీ, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, వయోజన విద్యా సంయుక్త సంచాలకులు గోవింద్ రావు, స్వయం సహాయక మహిళా సమాఖ్య ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.