మోర్తాడ్, మే 29: బాల్కొండ నియోజకవర్గంలోని కాకతీయ కాలువ వెంబడి ఉన్న గ్రామాల రైతులు పసుపు పంట సాగుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు లీకేజ్ నీటిని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాది పొడవునా కాకతీయ కాలువలో నీరు నిల్వ ఉండేదని, దీంతో రైతులు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాగు చేసుకునేవారని శుక్రవారం ఒక ప్రకటనలో గుర్తు చేశారు.
ప్రస్తుతం కాలువలో పూర్తిగా నీరు లేక రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఎస్సారెస్సీలో ప్రస్తుతం తగినంత నీటి నిల్వలు ఉన్నందున రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పసుపు పంట సాగుకు ఇది కీలక సమయమని, ప్రభుత్వం, సాగునీటి శాఖ అధికారులు వెంటనే స్పందించి లీకేజ్ వాటర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.