కరువు సీమలో గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి. ఎండిపోయిన వాగులు నిండుగా పారుతున్నాయి. కాళేశ్వర ప్రాజెక్టు ఫలాలు ఇప్పుడు కండ్ల ముందర సాక్షాత్కరిస్తున్నాయి. అద్భుత ఇంజినీరింగ్ కట్టడంపై కాంగ్రెస్ పన్నిన కుట్రలను గోదావరి జలాలు ముంచెత్తాయి. అధికార పార్టీ నేతలు చిమ్మిన విషపూరిత విమర్శలు కూడవెళ్లి వాగు మత్తడి నుంచి కొట్టుకుపోతున్నాయి. పవిత్రమైన గంగమ్మ జలాలు పంట పొలాలను చేరుతుంటే అన్నదాతలు మురిసి పోతున్నారు. దశాబ్దాల క‘న్నీటి’ కష్టాలు తొలగిపోయాయని సంబురపడుతున్నారు.
బీబీపేట్, ఫిబ్రవరి 10: కామారెడ్డి అంటేనే కరువు సీమ. రైతుల కన్నీటి గోసకు చిరునామా. దశాబ్దాలుగా తాగు, సాగునీరు లేక ఈ ప్రాంత రైతులు, ప్రజలు తల్లడిల్లారు. కండ్ల ముందే పంటలు ఎండుతుంటే ఎంతో మంది రైతులు ఉసురు తీసుకున్నారు. మరెంతో మంది వలసబాట పట్టారు. దశాబ్దాలుగా ఏలిన పాలకులు ఈ ప్రాంతంపై చిన్నచూపు చూశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఊరూరా కన్నీటి కష్టాలే. గంపెడాశలతో నాగలి పట్టి, పంట సాగు చేసిన రైతుకు ఏటేటా మిగిలింది నష్టాలే.
కానీ స్వరాష్ట్రం సిద్దించాక, కేసీఆర్ పాలనా పగ్గాలు స్వీకరించాక కరువుసీమలో మార్పు మొదలైంది. సాగునీటి గోస తీర్చే దిశగా అడుగు పడింది. అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కామారెడ్డి ప్రాంత కన్నీటి కష్టాలను తుడిచేసింది. ఎండిపోయిన కూడవెళ్లి వాగు ఇప్పుడు పారుతున్నదంటే కారణం ఆ కాళేశ్వరమే. కరువు సీమలో గోదావరి జలాలు మత్తడి దూకుతున్నాయంటే ఆనాడు కేసీఆర్ తీసుకున్న సంకల్ప బలమే.
సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు తెలంగాణను ఆగం చేశారు. నీళ్లు, కరెంట్ ఇవ్వకుండా రైతాంగాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు. దీంతో వేలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆత్మహత్యల పరంపరకు అడ్డుకట్ట వేసింది. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాతో పాటు సమృద్ధిగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచింది. తాగు, సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు, కరువు రక్కసి నుంచి తెలంగాణకు శాశ్వత విముక్తి కల్పించేందుకు అనేక మార్గాలను అన్వేషించింది. ఎన్నో రోజుల మేధోమధనం అనంతరం ఆవిర్భవించినదే కలల ప్రాజెక్టు కాళేశ్వరం. రైతుల గోసకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో అద్భుత ఇంజినీరింగ్ నైపణ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు కర్షకుల కష్టాలను దూరం చేసింది.
ఎక్కడో దిగువన ఉన్న కాళేశ్వరం నుంచి వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డి ప్రాంతానికి గోదావరి జలాలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. కరువు సీమలో గంగమ్మ పరవళ్లు తొక్కుతుందని ఎవరూ విశ్వసించలేదు. కానీ ఆ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ నుంచి విడుదలైన నీళ్లతో కూడవెళ్లి వాగు ప్రస్తుతం మత్తడి దూకుతున్నది. బీబీపేట్ మండలం తుజాల్పూర్ గ్రామశివారులో ఉన్న ఈ వాగు నిండుగా పారుతుండడంతో రైతాంగం మురిసి పోతున్నది. సాగునీటి కష్టాలు ఇక శాశ్వతంగా దూరమయ్యాయని తుజాల్పూర్, మల్కాపూర్, యాడారం, కోనాపూర్, రాంరెడ్డిపల్లి గ్రామాల రైతులు సంబురపడుతున్నారు.
ఎన్నో ఏండ్లుగా నీళ్ల కోసం మస్తు తిప్పలు వడ్డం. కండ్ల ముందర పంట ఎండిపోతుంటే గుండె తరుక్కు పోతుండే. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతోని మా కష్టాలు తీరినయ్. సాగునీటికి ఇక రందీ పోయినట్లే. వానకాలంలోనే పారేటి కూడవెళ్లి వాగు ఇప్పుడు మత్తడి దూకుతున్నదంటే అది కేసీఆర్ పుణ్యమేనాయే. రెండు పంటలకు ఇక ఢోకా లేనట్లే
– నక్క సంతోష్, రైతు, తుజాల్పూర్
ఎక్కడి గోదావరి ఎక్కడికి వచ్చింది. కూడవెళ్లి వాగు మత్తడి దూకు తుంటే మస్తు సంతోషమ నిపిస్తు న్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన నీళ్లు మల్లన్నసాగర్ నుంచి మా ఊరికి వస్తాయంటే మొదట్ల నమ్మలే. ఇప్పుడు కండ్ల ముందరకే గంగమ్మ కదిలొచ్చింది. వాగు పారుతుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి.
– నీరడి వెంకటేశ్, రైతు, తుజాల్పూర్
కామారెడ్డి అంటేనే కరువు గడ్డ అని పేరు. అట్లాంటిది కేసీ ఆర్ వల్ల ఈ ప్రాంతానికి నీళ్ల సమస్య లేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టు డుతోని రైతాంగానికి మస్తు మంచి జరుగుతున్నది. ఎక్కడ గోదావరి.. ఎక్కడ కూడవెళ్లి. గంగమ్మ ఎటు తిరిగి ఎటు వచ్చింది. ఇప్పుడు కూడవెళ్లి వాగుల నీళ్లు పారుతున్నాయంటే ఆ గొప్పతనం కేసీఆర్‌దే కదా.
– రాజేశ్వర్‌రావు, రైతు, మల్కాపూర్