ధర్పల్లి, ఆగస్టు 5: గతేడాది తమ గ్రామాన్ని ముంచేసిన ముత్యాల చెరువుకు మరమ్మతులు చేపట్టవద్దని వాడీ గ్రామస్తులు బుధవారం ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేయడంతో పాటు ఇరిగేషన్ సిబ్బందిని అడ్డుకున్నారు. మండలంలోని హోన్నాజీపేట్, నడిమితండా అటవీ శివారులోని ముత్యాల చెరువు అలుగు కట్ట గతేడాది భారీ వర్షాల కారణంగా తెగిపోయి, వాడీ గ్రామాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తెగిన చెరువు కట్టకు ఎలాంటి మరమ్మతులు చేయలేదు. అయితే, బుధవారం మరోమారు ముత్యాల చెరువును పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఆపరేషన్స్ అండ్ మెయింటేనెన్స్ (ఓఎం)అధికారులు వస్తున్నారని తెలుసుకున్న వాడీ గ్రామస్తులు బస్టాండ్ వద్ద రాస్తారోకోకు దిగారు. వేరే మార్గంలో వెళ్లారని తెలిసి నడిమి తండా వద్దకు వెళ్లి అధికారులను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో నడిమితండా వాసులు తమ మొర విని వచ్చిన అధికారులను మీరెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో ఇరువైపులా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. చివరకు అధికారులు ఇరుపక్షాలను ఒప్పించి చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. ఇప్పుడే నిర్మాణాలు చేపట్టడం లేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరిశీలించి నివేదికలు పంపిస్తామన్నారు. అయితే, వాడీ గ్రామస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముత్యాల చెరువు కట్ట మరమ్మతులు చేపట్టవద్దని విన్నవించారు.