Nizamabad | వినాయక నగర్, నవంబర్ 28: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతీ ఒక్క ఓటరు సహకరించాలని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి సూచించారు. క్రిటికల్(సమస్యాత్మక) గ్రామంగా గుర్తింపు ఉన్న నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఆకుల కొండూరు గ్రామంలో శుక్రవారం పోలీస్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో గ్రామ పెద్దలు, ఓటర్లు, యువకులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ, రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు నిర్వహించుకొని తమ బాధ్యత ఉండాలని ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ ప్రజలు బాధ్యత తీసుకొని సహకరించాలని కోరారు. ప్రతీ ఓటరు తమ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు శాంతి భద్రతలకు విగాథం కలగకుండా చూడాలని పిలుపునిచ్చారు.