ధర్పల్లి, నవంబర్ 12: త మ గ్రామానికి బస్సు నడపరా..? అంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం పోత్నూరు స్టేజీ వద్ద బుధవారం చోటుచేసుకున్నది. మండలంలోని రేకులపల్లి గ్రామానికి ఇదివరకు దుబ్బాక పోత్నూరు మీదుగా ఇదివరకు ఆర్టీసీ బస్సు టిప్పులు ఉండేవి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దుబ్బాక రేకులపల్లి మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద రోడ్డు దెబ్బతిన్నది. దీంతో ఆర్టీసీ అధికారులు రేకులపల్లికి బస్సు ట్రిప్పులను నిలిపివేశారు. బస్సు దుబ్బాక వరకు వచ్చి.. వెనక్కి వెళుతున్నది. ఈ విషయమై గ్రామస్తులు ఇదివరకే పలుమార్లు నిజామాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామానికి బస్సు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమ గోడును వెల్లబోసుకున్నారు.
గ్రామంలో ఇటీవల ఒక వృద్ధుడు మరణిస్తే.. బస్సు సదుపాయం లేక ఆయన కూతురు గ్రామానికి చేరుకోవడానికి ఆలస్యమైందని, అంత్యక్రియలకు కూడా సమయానికి హాజరు కాని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అధికారుల తీరును నిరసిస్తూ బుధవారం పోత్నూర్ భీమ్‌గల్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. డిపో మేనేజర్‌కు ఫోన్ చేసినా.. స్పందించడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోత్నూరు లేదా దుబ్బాక మీదుగా తమ గ్రామానికి బస్సులు నడపాలని కోరారు. ధర్నా విషయం తెలుసుకున్న ధర్పల్లి, సిరికొండ ఎస్సైలు కళ్యాణి, రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను సముదాయించారు. దీంతో రేకులపల్లి గ్రామస్తులు అక్కడే ఉన్న బస్సులో ఆర్టీసీ డీఎంకు విన్నవించడానికి నిజామాబాద్ తరలివెళ్లారు. తమ గ్రామానికి బస్సు ట్రిప్పులు కొనసాగించకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.