మోర్తాడ్/భీమ్‌గల్, జనవరి 5: మున్సిపల్ ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేసి గులాబీ జెండాను ఎగురవేద్దామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. వేల్పూర్‌లోని తన నివాసంలో భీమ్‌గల్ మున్సిపాలిటీ ముఖ్యనాయకులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో వేముల మాట్లాడారు. గత పదేండ్లలో భీమ్‌గల్‌ను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దేనని, రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉన్నదన్నారు. భీమ్‌గల్ పంచాయతీగా ఉంటే నిధులు తక్కువగా వస్తాయని మున్సిపాలిటీగా మార్చామని గుర్తు చేశారు. గతంలో చాలా దారుణంగా ఉండే భీమ్‌గల్ రూపురేఖలు మారడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు.
భీమ్‌గల్ అభివృద్ధికి ప్రణాళిక తయారు చేయడమే కాకండా అప్పటి మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.25 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మిగిలిన పనుల కోసం కూడా కేటీఆర్‌ని అడిగి రూ.10కోట్లు మంజూరు చేయించి, వివిధ పనులకు టెండర్లు పిలిచామని చెప్పారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులను ఆపిందని, ఎక్కడా తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదని విమర్శించారు.
2014 కంటే ముందు పోల్చితే ఇప్పుడు భీమ్‌గల్ ఈస్థాయిలో ఉందంటే దానికి కారణం కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో40 సర్పంచ్‌లు గెలిచాం, ప్రజలు మనవైపు ఉన్నారు, క్యాడర్ మొత్తం కలిసి పనిచేస్తే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ అన్ని కౌన్సిలర్ స్థానాలు గెలుస్తామని వేముల ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని కౌన్సిలర్ స్థానాలు గెలిచిన ఏకైక మున్సిపాలిటీ మన భీమ్‌గల్ మున్సిపాలిటీ, కాబట్టి కార్యకర్తల సమన్వయ లోపం భీమ్‌గల్ మున్సిపాలిటీలో కనబడకూడదని సూచించారు. భీమ్‌గల్ ప్రజల్లో బీఆర్ఎస్కు ఒక గౌరవం ఉన్నదని, కావున అక్కడ గులాబీ జెండా ఎగురేందుకు అందరు సిద్ధం కావాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ సూచించిన అభ్యర్థుల గెలుపు కోసం తాను ఇంటింటికీ తిరుగుతా, కార్యకర్తలుగా మీరందరు సమిష్టిగా పని చేయండని, ప్రజలు మనవైపే ఉంటారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి ఎలక్షన్ అప్పుడు మాత్రమే అన్ని ఇస్తున్నారు, ఎలక్షన్లు అయిపోగానే అన్ని ఎగ్గొడుతున్నారని ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు, రైతుబంధు సరిగ్గా వేయడం లేదు, సకాలంలో ఎరువులు అందివ్వడం లేదు, మహిళలకు ఇస్తామన్న రూ.2500 పింఛన్ ఇయ్యలేదు. పింఛన్ పెంచలేదు. ఇలా ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్‌గల్‌లో వంద పడకల ఆసుపత్రి, వెజ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు ఆగిపోయాయని, అందుకు కారణం కాంగ్రెస్సేనని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు మంత్రిని తీసుకొచ్చి పాత పనులకు కొబ్బరికాయ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌పై కోపంతో ఉన్నారు, ఎన్నికలు వచ్చినపుడు కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమని హెచ్చరించారు.