మోర్తాడ్, నవంబర్ 24 : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పదేండ్ల కాలంలో మత్స్యకారులకు ఉచిత చేపపిల్లలు, రొయ్య పిల్లలను సరాఫరా చేశారని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కోటీ 74 లక్షల చేపపిల్లలు, 86 లక్షల రొయ్య పిల్లలు సుమారు రూ. 3 కోట్ల 70 లక్షలతో పదేండ్లలో రూ.35 కోట్లతో సరఫరా చేశారన్నారు. ఉచిత మత్స్యకారులకు రూ. 8 కోట్ల విలువగల మోపెడ్ టీవీఎస్ స్కూటీలు, వలలు, మొబైల్ ఫిష్‌మార్కెట్ వాహనాలు ఇలా అనేక సౌకర్యాలు కల్పించామన్నారు.
రూ.72 లక్షలతో ఎనిమిది మత్స్య సహకార సంఘ భవనాలు, రూ.10 లక్షలతో బాల్కొండలో ఫిష్‌మార్కెట్, సుమారు 19 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.77 లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్ చెక్కలను అందజేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది కోటీ 74 లక్షల చేపపిల్లలకు 83 లక్షలు మాత్రమే సరఫరా చేసిందని తెలిపారు. రొయ్యపిల్లలను అసలే పంపిణీ చేయలేదని, కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు ఒక్కటి కూడా ఈ రెండేండ్లలో మత్స్యకారులకు ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో దామోదర్, ప్రవీణ్‌రెడ్డి, వెంకటేశ్, నర్సారెడ్డి, సామవెంకట్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.